డ్రోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో  సవాళ్ళు

 డ్రోన్లు ప్రభుత్వానికి, ప్రభుత్వేతర సంస్థలకు సులువుగా అందుబాటులోకి రావడంతో భద్రతాపరమైన సవాళ్ళు పెరుగుతున్నాయని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే చెప్పారు. డ్రోన్ల తయారీ ఓ కుటీర పరిశ్రమగా మారిందని తెలిపారు. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు భవిష్యత్తులో అన్ని రకాల పోరాటాల్లో డ్రోన్లను ఉపయోగించడం పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు ప్రణాళికలో దీనిని చేర్చాలని తెలిపారు. డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

భారీ నష్టం కలగజేసే ఆయుధాలను, మానవులకు ప్రమాదకరం కానటువంటి ఆయుధాలను తిప్పికొట్టేందుకు తగిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కొత్త ముప్పుల పట్ల దళాలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దూకుడుగా దాడి చేయడానికి, అదేవిధంగా ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనడానికి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం పట్ల దృష్టి సారించినట్లు వివరించారు.

డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌ను దూకుడుగా దాడి చేయడానికి, అదేవిధంగా ఆత్మరక్షణకు ఉపయోగించుకోవడంపై సైన్యం దృష్టి పెట్టిందని చెప్పారు. జమ్మూలోని భారత వాయు సేన స్థావరంపై జూన్ 27న డ్రోన్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. భారత సైనిక స్థావరంపై డ్రోన్లతో దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ దాడికి పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం కూడా ఉందని, పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా,   జుమ్ము ఎయిర్ పోర్టు‌ డ్రోన్ దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నేడు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజు ఎన్‌ఐఏ అధికారులు క్షేత్రాస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. వాస్తవానికి దాడి జరిగిన నాటి నుంచే ఎన్ఐఏ అధికారులు క్షేత్రస్థాయిలో  ఉంటున్నప్పటికీ.. నేడు అధికారికంగా వారు తన పని ప్రారంభించారు.

ఈ క్రమంలో ఐజీ, డీఐజీ స్థాయి సీనియర్ అధికారులు జమ్మూకు చేరుకున్నారు. త్వరలో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కూడా అక్కడికి చేరుకుంటారని సమాచారం.  బుధవారం నాడు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ డీజీలు జమ్మూ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన టెక్నిల్ స్టేషన్‌ను సందర్శించారు.

పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఎయిర్ పోర్టు‌కు రక్షణ కల్పిస్తున్న వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులతో చర్చించారు. అంతేకాకుండాఎయిర్ పోర్టులో డ్రోన్ నిరోధక వ్యవస్థలను నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ ఏర్పాటు చేశారు.