సాగు చట్టాల రద్దు వద్దు, సవరణలు చాలు

నూతన సాగు చట్టాలను పూర్తిగా తిరస్కరించే బదులు, ఇబ్బందిగా ఉన్న వాటిని సవరిస్తే సరిపోతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రానికి సూచించారు. ఇలా చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని చెప్పారు. మహారాష్ట్ర మంత్రుల బృందం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లోని వివిధ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు. 
 
రైతుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సర్కార్ తీర్మానం చేస్తుందా? అన్న ప్రశ్నకు పవార్ స్పందిస్తూ ‘‘చట్టాలను పూర్తిగా తిరస్కరించే బదులు  రైతులకు ఇబ్బంది ఉన్న వాటిని సవరించవచ్చు. సాగు చట్టాలపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే అసెంబ్లీ ముందుకు తెస్తాం’’ అని పవార్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు ఈ చట్టాలను ఆమోదించే బదులు, వివాదాస్పదంగా మారిన అంశాలపై అధ్యయనం చేస్తే బాగుంటుందని పవార్ సూచించారు.
 
కాగా, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా మరే ఇతర డిమాండ్‌ను అయినా పరిగణలోకి తీసుకుని చర్చించేందుకు సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. గతంలో అనేకసార్లు జరిగిన చర్చల్లో రైతులతో ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఆయన గుర్తు చేసారు. 
‘‘రైతులకు మేము ఇది వరకే స్పష్టం చేశాం. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా రైతులు ఏ ప్రతిపాదన చేసినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 25 నుంచి ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోలన నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకవడం మినహా మరే ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు అంటుంటే.. ఉపసంహరణ మినహా మరేదైనా మాట్లాడడానికి సిద్ధమేనని ప్రభుత్వం పట్టుబట్టి కూర్చుంది. దీంతో ప్రభుత్వం, రైతు సంఘాల 12 సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.