డిజిట‌ల్ ఇండియాతో టెక్నాల‌జీలో దూసుకెళ్తున్నాం

డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మంతో టెక్నాల‌జీ అనుక‌ర‌ణ‌లో దేశంలో చాలా వేగంగా ముందుకు వెళ్లింద‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి ఆరేళ్లు పూర్తయిన నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వహిస్తూ డిజిట‌ల్ ఇండియాలో భాగంగా అనేక రాష్ట్రాలు ప‌లు స్కీమ్‌ల‌ను నిర్వ‌హిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఆవిష్క‌ర‌ణ కోసం ఆస‌క్తి ఉంటే.. టెక్నాల‌జీని వేగంగా అందిపుచ్చుకోవ‌చ్చని ప్రధాని తెలిపారు. 21వ శ‌తాబ్ధ‌పు భార‌త నినాదం డిజిటిల్ ఇండియా అని ఆయ‌న చెప్పారు. . కోవిడ్ వేళ డిజిటిల్ ఇండియా ఎంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసిందో చూశామ‌ని గుర్తు చేశారు.

అభివృద్ధి చెందిన దేశాలు విఫ‌ల‌మైన వేళ‌.. మ‌నం నేరుగా ఖాతాల్లోకి అమౌంట్‌ను బ‌దిలీ చేశామ‌ని పేర్కొన్నారు. ఆ నగదు మొత్తం సుమారు 7 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. డిజిటల్ ఇండియా మిష‌న్ ద్వారా మౌళిక స‌దుపాయాల అభివృద్ధిపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. అనేక ప్ర‌పంచదేశాలు కోవిన్ పోర్ట‌ల్ ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచిన‌ట్లు ప్రధాని గుర్తు చేసారు.

కోవిన్ ద్వారా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ .. మ‌న టెక్నాల‌జీ సామ‌ర్థ్యాన్ని నిరూపించింద‌ని ప్రధాని చెప్పారు. ఆన్‌లైన్ విద్య‌, వైద్య కోసం డెవ‌ల‌ప్ చేసిన ఫ్లాట్‌ఫామ్స్ కోట్లాది మంది భార‌తీయుల‌కు ఉప‌యోగ‌ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. డిజిలాక‌ర్ ద్వారా డిజిటిల్ ఇండియా సామ‌ర్థ్యం తెలుస్తుంద‌ని ప్రధాని పేర్కొన్నారు.

స్కూల్‌, కాలేజీ డాక్యుమెంట్లు, ఆధార్‌, ప్యాన్, ఓట‌ర్ కార్డుల‌ను డిజీలాక‌ర్‌లో ఈజీగా దాచుకోవ‌చ్చు ప్రధాని త్లెఇపారు. డిజిట‌ల్ ఇండియా వ‌ల్లే వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు అమ‌లు సాధ్య‌మైంద‌ని చెప్పారు. డిజిటల్ ఇండియా పథకం సామాన్యులను సాధికారులను చేసిందని తెలిపారు. ‘కనిష్ట స్థాయిలో ప్రభుత్వం, గరిష్ఠ స్థాయిలో పాలన’కు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. 

ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐక్య రాజ్య సమితి ఐటీయూ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్స్‌లో భారత దేశానికి 10వ ర్యాంక్ వచ్చిందని ప్రధాని చెప్పారు. మన దేశంలో డేటా ప్రైవసీ సెక్యూరిటీ పెరిగిందని తెలిపారు. విద్య నుంచి మందుల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయని చెబుతూ  వైద్య సేవలు చిట్ట చివరి వరకు బట్వాడా అవుతున్నాయని పేర్కొన్నారు.  డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు. 

ఉత్తర ప్రదేశ్‌లో దీక్షా పథకం లబ్ధిదారు సుహానీ సాహు మాట్లాడుతూ, తాను ఐదో తరగతి చదువుతున్నానని చెప్పారు. దీక్ష పథకం వల్ల తన చదువు మరింత ఇంటరాక్టివ్, ఆనందమయం అయిందని చెప్పారు. తమకు వాట్సాప్‌లో ఓ లింక్ వస్తుందని, తాను దీని ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. చాలా కార్టూన్లను కూడా చూడగలుగుతున్నానన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ వర్గాల ప్రజలతో  సంభాషించారు. మహారాష్ట్ర రైతు ప్రహ్లాద్ బోర్ఘడ్ మాట్లాడుతూ, ఈ-నామ్ (నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్) వేదిక తనకు చాలా ఉపయోగపడుతోందని చెప్పారు. తనవంటి చిన్నతరహా రైతులకు మేలు జరుగుతోందని తెలిపారు. 2018 నుంచి ఈ వేదికను తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధర వస్తోందని, తాము సౌకర్యవంతంగా అమ్ముకోగలుగుతున్నామని తెలిపారు. తమ వంటి రైతులు ఎక్కడికీ వెళ్ళలేరని, డిజిటల్ విధానం వల్ల తమకు రవాణా భారం తగ్గిందని వివరించారు.

ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇటువంటి విషయాలను ఇతర రైతులకు కూడా తెలియజేయాలని కోరారు. ఈ విధంగా అందరు రైతులకు అవగాహన కలిగితే ఈ-నామ్‌పై నమ్మకం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ విధానాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో టెలిమెడిసిన్‌ను మరింత ఎక్కువ మంది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని తెలిపారు. ఈ-నామ్‌పై రైతుల నమ్మకం పెరగాలని సూచించారు.