లష్కరే తొయిబా టాప్ కమాండర్ కాల్చివేత

కశ్మీర్‌ లోయలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్‌ ను భద్రతా బలగాలు కాల్చివేశాయి.  కశ్మీర్‌లో సాయుధ  బలగాలు, పౌరులపై జరిగిన దాడి ఘటనల్లో అబ్రార్ ప్రమేయం ఉంది.
 
కశ్మీర్ జోన్ ఐజీపీ విజయర్ కుమార్ ఓ ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఇది భద్రతా బలగాల భారీ విజయంగా ఆయన అభివర్ణించారు.  జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని అధికారులు తెలిపారు. 

భద్రతా దళాలు, స్థానిక పౌరులపై దాడులు జరిపి పొట్టన పొట్టుకున్న అబ్రార్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ జరుపగా.. అబ్రార్‌ తన ఏకే-47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచానని తెలిపాడు.

ఈ క్రమంలో ఆయుధాన్ని రికవరీ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఇంట్లో దాక్కున్న మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరుపడంతో అబ్రార్‌ సైతం కాల్పుల్లో మృతి చెందగా, మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

శ్రీనగర్ పోలీసులు, జమ్మూ కశ్మీర్ ఎలైట్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. వారి నుంచి ఒక పిస్తోలు, గ్రనేడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో లవేపొరా వద్ద ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని హతమార్చిన ఘటనలో అబ్రార్ ప్రమేయం ఉంది. లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కాంట్రుకి అతను సన్నిహిత సహచరుడని, పలు హత్యా ఘటనల్లో అబ్రార్ ప్రమేయముందని అధికారులు తెలిపారు.