
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఇన్ని రోజులకు రాంనాథ్ కోవింద్ తాను పుట్టిన ఊరు పరాంఖ్‌కు వెళ్లారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే భూమాతకు నమస్కారం చేశారు. మట్టిని చేత్తో తీసుకుని నుదుటిపై రాసుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ గ్రామంలో తన చిన్ననాటి మిత్రులు, సహావిద్యార్థులు, తనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేపట్టిన వారితో సమావేశమై గత స్మృతులను నెమరేసుకున్నారు.
తనతో కలిసి చదువుకున్న పలువురిని పేర్లతో పిలిచి వారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రామంలోని పత్రి మాతా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరిధిలో ఉన్న పరాంఖ్ గ్రామానికి కాన్పూర్ నుంచి ప్రత్యేక అధ్యక్ష రైలులో చేరుకున్నారు.
తమ గ్రామస్థుడు భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికై సేవలందించడాన్ని ఆ ఊరి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. కోవింద్‌ను కలిసేందుకు గ్రామస్థులు గత రెండు రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నారు. భారత రాష్ట్రపతి తమ గ్రామానికి వస్తుండటంతో గ్రామస్థులు ఎంతో సంతోషపడుతున్నారు.
ఒక మారుమూల గ్రామానికి చెందిన తనలాంటి ఒక సాధారణ కుర్రాడు ఇంత పెద్ద దేశానికి చెందిన అత్యున్నత బాధ్యతలను నిర్వర్తించే అధికారాన్ని పొందుతానని తాను ఏనాడూ ఊహించలేదని రాంనాథ్ కోవింద్ చెప్పారు. అయితే, మన దేశ ప్రజాస్వామ్య విధానం దీన్ని సుసాధ్యం చేసి చూపిందని జనవరిలో కాన్పూర్‌లో జరిగిన జన్ అభినందన్ సమారోహ్ సందర్భంగా చెప్పారు.
‘ఈ సందర్భంగా మన దేశ స్వాతంత్య్ర సమరయోధులకు, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వారి కారణంగానే సాధారణ కుర్రాడిని రాష్ట్రపతి కాగలిగాను. ఈ క్రెడిట్ అంతా ఈ మట్టిదే.. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులదే’ అని రాంనాథ్ కోవింద్ భావోద్వేగంతో చెప్పారు.
ఈ మాతృభూమి ప్రేరణనే తనను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు నుంచి రాజ్యసభకు, అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు, తద్వారా రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లిందని ఆయన తెలిపారు. భార్య సవితాదేవితో కలిసి ప్రత్యేక అధ్యక్ష రైలులో న్యూఢిల్లీ నుంచి తన మాతృభూమికి వెళ్లి అక్కడి ప్రజలను కలుసుకోవాలని చాలా రోజుల క్రితం నిర్ణయించుకున్నానని చెప్పారు.
అది ఇప్పుడు సాకారమైంది. కాన్పూర్‌కు ప్రత్యేక రైలులో చేరుకున్న కోవింద్, ఆయన భార్య.. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో తన స్వగ్రామానికి వచ్చారు. గత 15 ఏండ్లలో రాష్ట్రపతి తొలిసారి రైలు ప్రయాణం చేస్తుండటం విశేషం. తనను ప్రథమ పౌరుడు అని పిలవడానికి కారణం తాను రాష్ట్రపతిని అవడమేనని చెప్పారు.
గతంలో ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళడమే కష్టంగా ఉండేదని చెబుతూ నేటి పరిస్థితి అది కాదని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థ ప్రతివారికీ మార్గాన్ని తెరచి ఉంచిందని చెప్పారు. పుట్టినప్పటి హోదాతో సంబంధం లేకుండా ముఖ్యమైన మైలురాళ్ళ వంటి విజయాలను సాధించడానికి అవకాశాలను ప్రజాస్వామిక వ్యవస్థ కల్పించిందని తెలిపారు.
రాష్ట్రపతిని గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఘనంగా స్వాగతం పలికారు.
More Stories
పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష