నకిలీ టీకాతో టిఎంసి ఎంపీ మిమీ చక్రవర్తికి అనారోగ్యం

పశ్చిమ బెంగాల్​లోని కోల్ కతాలో ఫేక్ వ్యాక్సినేషన్ల కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో వ్యాక్సిన్​ తీసుకున్న టీఎంసీ ఎంపీ, హీరోయిన్​ మిమీ చక్రవర్తి శనివారం అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమె అనారోగ్యానికి కారణం ఫేక్ వ్యాక్సినేనా? అన్నది ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు పేర్కొన్నారు. 

ఆమె కుటుంబానికి దగ్గరి వ్యక్తులు వెల్లడించిన ప్రకారం మిమి డీహైడ్రేషన్, కడుపునొప్పి, బీపీ పడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్​నని చెప్పుకొంటూ దేబాంజన్ దేబ్ అనే వ్యక్తి  బుధవారం కోల్​కతాలో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాడు. 

అన్ని క్యాంపుల ద్వారా సుమారు రూ. కోటి వరకూ వసూలు చేశాడు. కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేపట్టామని, వ్యాక్సిన్ తీసుకుని ప్రజలను ఎంకరేజ్ చేయాలని కోరడంతో తాను కూడా టీకా తీసుకున్నానని మిమీ చెప్పారు. కానీ తాను వ్యాక్సిన్ వేసుకున్నట్లు కొవిన్ పోర్టల్ నుంచి ఎలాంటి మెస్సేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిందని ఆమె చెప్పారు. 

ఈ ఘటనకు సంబంధించి దేబాంజన్ దేబ్​తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా వ్యాక్సిన్​కు బదులుగా అమికాసిన్ అనే యాంటీబయోటిక్ ఇంజక్షన్లను ఇచ్చారని గుర్తించారు. సీఎం మమతా బెనర్జీ ఆదేశాల మేరకు వీరిపై హత్యాయత్నం కింద కేసు పెట్టారు. 

కాగా, ముంబైలో నకిలీ టీకాల శిబిరాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2000 మంది వరకు బాధితులు ఉండొచ్చని చెప్తున్నారు. కిందటి వారం కాందీవాలిలోని ఓ హౌసింగ్ సొసైటీలో నిర్వహించిన క్యాంప్​లో 390 మందికి ఓ ముఠా వ్యాక్సిన్​ వేసింది. వ్యాక్సిన్​ తీసుకున్న వారికి మెసేజ్‌లు రాకపోవడం, జ్వరం లాంటి లక్షణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.