ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ డిమాండ్‌ అవివేకమే

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం అవివేకం, మూర్ఖత్వమని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి బీజేపీకి 70 ఏండ్ల సమయం పట్టిందని గుర్తు చేశారు. 

రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ రాజకీయ నేతలతో జరిపిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన తర్వాత  సమావేశం వివరాలు వెల్లడిస్తూ ఈ సమావేశంతో తమ పోరాటం ముగియలేదని, ఇప్పుడే  మొదలైందని చెప్పారు. 

ప్రధాని మోదీతో సమావేశాల ద్వారా, ప్రభుత్వం ప్రభుత్వ కాలంలో  ఆర్టికల్‌ 370 ని తిరిగి తీసుకొస్తామని చెప్పడం ప్రజలను మోసపుచ్చడమే కాగలదని సహచర రాజకీయ నేతలను హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తిరిగి వస్తుందని ఆశించడం అవివేకమే అని ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు.

దానిని పునరుద్ధరించడానికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు లేవని ఆయన తెలిపారు. మూడు గంటలకు పైగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిన ఐదుగురిలో ఒమర్ అబ్దుల్లా ఒకరు. ఈయనతోపాటు నిర్మల్ సింగ్, తారాచంద్, గులాం-ఏ-మీర్, రవీందర్ రైనా కూడా ఈ సమావేశంలో ఏమీ మాట్లాడలేదు.

“సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల గురించి, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం గురించి, జమ్ముకశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం, దానికి రాష్ట్ర హోదా ఇవ్వడం గురించి ప్రధాని స్వయంగా మాట్లాడారు” అని చెప్పారు. 

జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించడంతో తానెంతో ఆసక్తితో ఉన్నానని, ఇది గత ఏడాది కరోనా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ అతిపెద్ద భౌతిక సమావేశం అని ఆయన పేర్కొన్నారు.

 కాగా, ఆర్టికల్‌ 370, 35ఏని పునరిద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కన్న ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యం చెప్పారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక హోదా, ఆర్టికల్‌ 370, 35ఏని పునరిద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.. అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు’’ అని ఆమె తెలిపారు.