![అసెంబ్లీ ఎన్నికలపై జెపి నడ్డా కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికలపై జెపి నడ్డా కీలక భేటీ](https://nijamtoday.com/wp-content/uploads/2021/06/JP-Madda-meet.jpg)
వచ్చేవారం మొదట్లో జరుగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వరుసగా కీలక భేటీలు జరుపుతున్నారు. గత వారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ చార్జ్ లతో రెండు రోజులపాటు సమావేశమయ్యారు. వారంతా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఆయన పార్టీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు. తాజాగా నేడు పలువురు సీనియర్ మంత్రులతో సమావేశం జరిపారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో పంజాబ్ లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్నది.
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం బిజెపికి కీలకం కాగలదు. 2024 లోక్ సభ ఎన్నికలలో తిరిగి కేంద్రంలో బిజెపి అధికారమలోకి రావడానికి ఉత్తర ప్రదేశ్ నిర్ణయాత్మకం కానున్నది. అందుకనే ఇప్పటికే ప్రధాని స్వయంగా ఆ రాష్ట్రంపై దృష్టి సారించి, భారీ కసరత్తు చేస్తున్నారు.
నేడు నడ్డా జరిపిన సమావేశంలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, తోమర్, స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు.
‘మన్ కీ బాత్’ ప్రతి కార్యకర్త చూడాలి
ఇలా ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని తోటి కార్యకర్తలతో కలిసి చూడాలని బీజేపీ కార్యకర్తలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఇంట్లో పెద్దవారితో కలిసి మాట్లాడుకున్నట్లుగా జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోందని పేర్కొన్నారు.
జేపీ నడ్డా శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’కు ప్రజాదరణ బాగుందన్నారు. దీని గురించి తనకు అనేక ఉత్తరాలు వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో పెద్దవారితో మాట్లాడుకున్నంత సాధారణంగా ఈ కార్యక్రమం ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోందని చెప్పారు.
ఆనంద్ స్వరూప్ అనే వ్యక్తి నుంచి ఓ లేఖ వచ్చిందని, ఇది ఆలోచనలను రేకెత్తిస్తోందని చెప్పారు. ఆయన చాలా ప్రశంసనీయమైన సలహాలు ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బూత్ స్థాయి పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని, ఆ మరుసటి నెలలో వేరొక బీజేపీ కార్యకర్త ఇంట్లో ఈ కార్యక్రమాన్ని వినాలని సూచించారు.
మణిపూర్ బిజెపి అధ్యక్షురాలిగా శారదా దేవి
బీజేపీ మణిపూర్ విభాగం అధ్యక్షురాలిగా శారదా దేవిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ ఏడాది మేలో కోవిడ్‌తో తికేంద్ర సింగ్ మృతి చెందడంతో మణిపూర్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న శారదా దేవిని పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా పార్టీ నియమించింది.
కాగా, బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే భబేష్ కలితను ఆ పార్టీ అసోం విభాగం అధ్యక్షుడిగా నడ్డా నియమించారు. తక్షణం ఈ నియామకం అమల్లోకి వచ్చింది. అసోం రాష్ట్ర మంత్రి రంజీత్ కుమార్ దాస్ స్థానంలో కలితను నియమించారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500