అయోధ్య అభివృద్ధిలో సంస్కృతి మిళితమైపోవాలి 

అయోధ్య  అభివృద్ధి పనుల్లో సాంస్కృతిక, సంప్రదాయాలు స్పష్టంగా గోచరిస్తూనే ఉండాలని, అందులో సంస్కృతి మిళితమైపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.  అయితే అయోధ్య నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు రాబోయే తరాలకు కూడా అనుసంధానించేలా ఉండాలని స్పష్టం చేశారు. 

 అయోధ్య‌లో చేప‌డుతున్న రామాల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌ధాని మోదీ స‌మీక్షించారు. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో మోదీ వ‌ర్చువ‌ల్ వీడియో స‌మావేశంలో పాల్గొంటూ అయోధ్య అభివృద్ధి కోసం చేప‌డుతున్న అభివృద్ధి ప‌నుల ప్ర‌ణాళిక‌ల‌ను వివ‌రించారు.

అయోధ్య నగరం ప్రతి భారతీయుడికి ఎంతో సుపరిచితమైన నగరమని, సాంస్కృతిక నగరంగా ప్రతి భారతీయుడి మదిలో ఉందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. శ్రీరాముడు తన పరిపాలనలో ఏవిధంగానైతే ప్రజలను ఏకతాటిపై నడిపించారో, అలాగే అయోధ్య అభివృద్ధి విషయంలో సమాజం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి, అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఈ అభివృద్ధి పనుల్లో స్థానిక యువత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని మోదీ సూచించారు. ‘‘అయోధ్య అందరి నగరం. ఆధ్యాత్మిక నగరం. ఉత్కృష్టమైన నగరం. చేపట్టబోయే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు భవిష్యత్ తరాలకు సరిపోయేలా ఉండాలి. యాత్రికులతో పాటు ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా మారాలి” అని ప్రధాని చెప్పారు.

భవిష్యత్తులోనూ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయి. అత్యంత కీలకమైన అభివృద్ధి దశ ఇప్పుడే ప్రారంభమైంది. అయోధ్య గుర్తింపును, సాంస్కృతిక చైతన్యాన్ని సజీవంగా ఉంచడానికి సమష్టిగా ప్రయత్నం చేద్దామని ప్రధాని పిలుపిచ్చారు. పాత,కొత్త మేలు కలయికలా నగరం ఉండాలని మోదీ సూచించారు. జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించాలన్న తపన భవిష్యత్ తరాలకు కలిగేలా అభివృద్ధి జరగాలని మోదీ తెలిపారు.

రోడ్ల నిర్మాణం, మౌళిక స‌దుపాయాలు, రైల్వే స్టేష‌న్‌, విమానాశ్ర‌య నిర్మాణాల కోసం వేసిన ప్ర‌ణాళిక‌ల‌ను సీఎం యోగి తెలియ‌ జెప్పారు. అయోధ్య‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మించాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఆమోదం తెలిపిన‌ట్లు సీఎం యోగి గుర్తు చేశారు. అందుకోసం కేంద్రం రూ 250 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ 1,000 కోట్లను జిల్లా యంత్రాంగానికి అందజేసింది. 

ప్ర‌ధాని మోదీ, యూపీ సీఎం యోగి అయోధ్య గురించి చ‌ర్చించ‌డం మంచి ప‌రిణామం అని, వారు చ‌ర్చిస్తేనే అయోధ్య‌లో ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంద‌ని అయోధ్య ఆల‌య పూజారి స‌త్యేంద్ర దాస్ కొనియాడారు. గత ఏడాది ఆగష్టు 5న అయోధ్యలో శ్రీ రామాలయం నిర్మాణంకు భూమి పూజ జరిపిన అనంతరం అయోధ్యలో అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఆయన సమీక్షా జరపడం ఇదే.