కాంగ్రెస్ నేతలను కేసీఆర్ పిలిపించుకున్నారా!

కాంగ్రెస్ నేతలను కేసీఆర్ పిలిపించుకున్నారా!
కె చంద్రశేఖరావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన  తర్వాత గత ఏడేళ్లలో ప్రతిపక్ష నాయకులు ఎవ్వరిని విడిగా కలవలేదు. కీలక ప్రజా సమస్యలపై ఆయనను కలవాలని వివిధ పార్టీల నేతలు ప్రయత్నించినా ఆయన అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం కాంగ్రెస్ నేతలను ఆయన కలవడం రాజకీయ వర్గాలలో విస్మయం కలుగుతున్నది.
 
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానికి చెందిన మరియమ్మ లాకప్‌డెత్‌ విషయంపై మాట్లాడ్డానికే సీఎంను కలిశామని   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. దీనికోసం మూడ్రోజుల క్రితమే అపాయిట్మెంట్ అడిగామని తెలిపారు. అయితే కేసీఆరే తానే కాంగ్రెస్ నేతలను పిలిపించుకున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.

గతంలో ఎన్నో సమస్యలపై సీఎంకు లేఖలు  రాసినా  అపాయిట్మెట్ అడిగినా క్యాంప్ ఆఫీసు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సీఎం స్పందిచక పోవడంతో  కాంగ్రెస్ నేతల గవర్నర్ ను కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నిక, ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో వీళ్ల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు సీఎంను కలవడంతో బీజేపీ నేతలుకూడా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అంటూ మండిపడుతున్నారు. 

క్యాంప్ ఆఫీసులో  సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కతో పాటు ఎంఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ చైర్మన్ ప్రీతమ్  సీఎంను కలిశారు. ఇటీవల లాకప్ డెత్ ఐన మరియమ్మ విషయంతో పాటు దళితులపై జరుగుతున్న దాడులను సీఎం దృష్టికి తీసుకెళ్లామని భట్టి పేర్కొన్నారు. 

కేసీఆర్ వెంటనే స్పందిస్తూ దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరపాలని, నిజనిర్ధారణ చేసి, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని  రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. 

పైగా, ఈ నెల 28న స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమారతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, కలెక్టర్‌, ఎస్పీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం సూచించారు. చింతకానికి వెళ్లి లాకప్‌డెత్‌ సంఘటన పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు.

మరియమ్మ కొడుక్కి ఉద్యోగం, పిల్లలకు ఆర్థికసాయంతో పాటు ఇల్లు ఇవ్వడానికి సీఎం ఒప్పుకున్నారని భట్టి తర్వాత చెప్పారు. సొంత పార్టీ వారే కాదు, చివరకు మంత్రులు కూడా కేసీఆర్ ను సమస్యలపై కలవలేని పరిస్థితులలో ఒక ప్రతిపక్ష నాయకుడిని కలవడం, వేంటనే ఉన్నతాధికారులను పిలిపించి, వారి సమక్షంలోనే ఆదేశాలు ఇవ్వడం గమనిస్తే అసలు ఉద్దేశ్యాలు వేరే ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

మరియమ్మ లాకప్‌డెత్ అంశం గురించి తాము సిఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన సిఎస్, డిజిపిని పిలిపించి తమ మధ్య ఈ విషయమై చర్చించారని అంటూ సీఎం వెంటనే సానుకూలంగా స్పందించారని ఒక విధంగా ప్రశంశాపూర్వకంగా భట్టి కొనియాడారు. 

కాగా, హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీ.హెచ్‌ మాటలు నిజమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.

త్వరలో జరుగబోయే హుజురాబాద్ ఉపఎన్నికలలో ఎట్లాగైనా గెలుపొందాలని ఒక వంక బిజెపి, మరో వంక అధికార పక్షం ఇప్పటి నుండే భారీ సన్నాహాలు చేస్తుండగా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎటువంటి హడావుడి చేయకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు కనీసం కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరో కూడా సంకేతం ఇవ్వడం లేదు.

కాంగ్రెస్ ఓట్లు కూడా తమకే బదిలీ అయ్యేవిధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. ఇంతలో ఆయన కాంగ్రెస్  నేతలతో భేటీ కావడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకు బలమైన సందేశం పంపిన్నట్లు అవుతున్నదని భావిస్తున్నారు.