రాయలసీమ నీటి వివాదంపై కేంద్రం ఆరా

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై కేంద్రం ఆరా తీస్తోంది. ప్రస్తు తం ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. కృష్ణానదీ జలాలను అక్రమంగా ఉపయోగించుకునేందుకు ఎపి ప్రభుత్వం రాయలసీమ విస్తరణ పథకం చేపట్టినట్లు వస్తున్న ఫిర్యాదులపై ఎన్‌జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పనులు చేపట్టవద్దని ఇదివరకే ఆదేశించామని, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని ఘాటుగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కూడా నేరుగా రంగంలో దిగారు. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్‌జిటి ఆదేశాలపై వారిద్దరు చర్చించారు. ఎపి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్‌డిఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయనకు సిఎం వివరించారు. 

నీటి పంపకాల విషయంలో ఎవరికి అన్యాయం జరుగకుండా చూస్తానని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు కేంద్రమంత్రి షెకావత్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎపి ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తుందా? లేదా? అన్న విషయమై నిజనిర్ధారణ చేయిస్తామని కూడా పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతుంటే తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

ఎన్‌జిటి ఆదేశాల నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)ను కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశించారు. 

జల వివాదంపై రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు కెఆర్‌ఎంబి అధికారులు వెనకడుగు వేస్తుండగా, అవసరమైతే కేంద్ర బలగాలను రప్పించి ప్రాజెక్టు పనులు పరిశీలించాలని గజేంద్ర సింగ్ సూచించారు. దీంతో ఒకటి, రరెండు రోజుల్లో కేంద్ర పోలీసు బలగాల సహాయంతో వారు రాయలసీమ ప్రాజెక్టుతో పాటు ఆర్‌డిఎస్ పనులను పరిశీలించనున్నారు.