బతుకమ్మకుంట కేసులో `సుప్రీం’లో హైడ్రాకు చుక్కెదురు 

బతుకమ్మకుంట కేసులో `సుప్రీం’లో హైడ్రాకు చుక్కెదురు 
బతుకమ్మకుంట వివాదంలో హైడ్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై నాలుగువారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్త, జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మలతోకూడిన ధర్మాసనం ఆదేశించింది. 
 
కంచె తొలగింపు సహా ఇతరత్రా విషయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఆ వివరాలను పొందుపరచాలని ఆదేశించింది. స్టేటస్‌కో ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బతుకమ్మకుంటలో హైడ్రా అభివృద్ధి పనులు చేపట్టడంపై మండిపడిన హైకోర్టు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ చేపట్టిన పనులన్నింటినీ తొలగించి పూర్వస్థితిని నెలకొల్పాలని గత నెల 17న ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది. తదుపరి విచారణను వచ్చేనెల 29కి వాయిదావేసింది. బతుకమ్మకుంట స్థలం విషయంలో గత కొన్నినెలలుగా హైడ్రాకు, ఎడ్ల సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం కొనసాగుతున్నది. బాగ్‌అంబర్‌పేటలోని సర్వేనంబర్‌ 563/1లో ఉన్న ఏడెకరాల భూమి తనదేనని, అందులో హైడ్రా పనులు చేపట్టడం సరైంది కాదంటూ సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సదరు వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ గత ఏడాది జూన్‌ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, వర్షాకాలంలో బతుకమ్మకుంటలోకి నీళ్లు వస్తే చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, వర్షపు నీరు మళ్లించడం కోసం అవసరమైన పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని హైడ్రా హైకోర్టును కోరింది. 
 
స్టేటస్‌కో ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు అక్కడ కేవలం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాలని ఆదేశించింది. హైడ్రా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆ స్థలంలో డ్రైనేజీ పనులతోపాటు పలు ఇతర అభివృద్ధి పనులను సైతం చేపట్టి పూర్తిచేసింది. పిల్లల ఆటస్థలం, వాకింగ్‌ ట్రాక్‌, ఓ గార్డెన్‌, బోర్లు వేయడం వంటి పనులు చేసింది. పనులు పూర్తయిన తరువాత ఆ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించింది. 
 
బతుకమ్మకుంట డెవలప్‌డ్‌ బై హైడ్రా అంటూ పెద్ద బోర్డు ఏర్పాటుచేసింది. దీనిపై హైడ్రా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పేర్కొంటూ సుధాకర్‌రెడ్డి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  హైడ్రా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము స్టేటస్‌కో ఉత్తర్వులు ఇచ్చేనాటికి బతుకమ్మకుంటలో భూమి స్వరూపం ఎలా ఉన్నదో తిరిగి అదే స్థితిని నెలకొల్పాలని మార్చి 17న ఆదేశించింది. అక్కడ హైడ్రా నిర్మించిన సరిహద్దు గోడ, గ్రిల్స్‌, ఆటస్థలం, తదితరమైన అభివృద్ధి పనులన్నీ తొలగించాలని స్పష్టం చేసింది.