నిరుద్యోగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

నిరుద్యోగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణను నిలబెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది.  దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9 శాతంగా నమోదైంది. ఈ మేరకు 2025 సంవత్సరానికి గానూ ప్రముఖ ఫైనాన్షియల్‌ సంస్థ బజాజ్‌ బ్రోకింగ్‌ తన తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. 
 
బడ్జెట్‌ సమా వేశాల సందర్భంగా కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వే 2025-26’ నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడించినట్టు తెలిపింది.  ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేండ్ల పాలనలో నిరుద్యోగుల గోస పుచ్చుకొం టున్నది. 
 
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షల్ని కూడా తమ ఖాతాలో వేసుకొని మొన్నటివరకూ పబ్బం గడిపిన రేవంత్‌ సర్కార్‌ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. అటు ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యోగ కోతలు యువతను కుదేలు చేస్తున్నాయి. మొత్తంగా దేశంలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో 8.9%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు బజాజ్‌ బ్రోకింగ్‌ తెలిపింది.
దేశంలో నిరుద్యోగిత రేటు సగటున 5.2 శాతంగా నమోదైతే, తెలంగాణలో దేశీయ సగటు కంటే 3.7% ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నట్టు వెల్లడించింది.  రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 16,978 మాత్రమే. అంటే ఏడాదికి సగటున 6,791,నెలకు సగటున 566, రోజుకు సగటున 19 ఉద్యోగాలు ఇచ్చిన్నట్లు వెల్లడి అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు బజాజ్‌ బ్రోకింగ్‌ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. 
 
‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటకలో నిరుద్యోగిత రేటు 8 శాతంగా ఉండగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇది 7.9 శాతంగా రికార్డయ్యింది. సాఫ్ట్‌వేర్‌కు తానే పితామహుడినని, ఉద్యోగాల సృష్టికి తానే ఆద్యుడిగా గప్పాలకు పోయే చంద్రబాబు నాయుడు ఏలుబడిలోని ఏపీలో కూడా నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 8.2 శాతంగా ఉన్నట్టు రిపోర్ట్‌ వెల్లడించింది.