తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం
తెలంగాణ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ అయ్యారు  ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 
1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్  సీనియారిటీ పరంగా చూస్తే డీజీపీ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.  ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో సీవీ ఆనంద్‌కు ఉన్న పట్టు, ఆయన ఇమేజ్‌ను సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు డీజీపీ బాధ్యతలు కట్టబెట్టింది. 

గతంలో హైదరాబాద్‌ సీపీగా, ఏసీబీ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ ఎన్నో విజయాలు అందుకున్నారు.  ఈనెల 30వ తేదీన డీజీపీగా శివధర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయగానే, ఆ మరుసటి రోజు మే 1వ తేదీన కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు తీసుకోనున్నారు.  సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలోనే పదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. 
 
నగరంలోని రోడ్లపై మృత్యుఘోషను తగ్గించేందుకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను కఠినతరం చేసి, జైలు శిక్షలు అమలు చేశారు. టెక్నాలజీని వాడుకుంటూ ఈ-చలాన్, స్పీడ్ గన్ వ్యవస్థలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పుడు షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ఐటీ కారిడార్‌లో మహిళలకు భరోసానిచ్చారు.  
 
పౌర సరఫరాలశాఖ కమిషనర్‌గా చేసినప్పుడు ఆన్‌లైన్ రేషన్ పంపిణీ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసి, కేవలం రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల ఆదా చేశారు. ఇందుకోసం ఆయనకు 2017-18లో నేషనల్ ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది. కేంద్ర సర్వీసుల్లో సీఐఎస్ఎఫ్ ఐజీగా కరోనా సమయంలో విమానాశ్రయాల భద్రతను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించారు.
అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన కేవలం 8 నెలల్లోనే 145 కేసులు నమోదు చేసి తెలంగాణ చరిత్రలో అత్యధిక కేసులు నమోదు చేసిన అధికారిగా రికార్డు సృష్టించారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డిల తర్వాత పూర్తి కాలపు డీజీపీగా ఆయన సేవలు అందజేయనున్నారు.