తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనకు వయసు 52 సంవత్సరాలు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావటంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్‌గా గుర్తించారు.
గంట సేపు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. 5 రోజులు మృత్యువుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి కన్నమూశారు. ఆయన మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల కేంద్రం నల్లబెల్లిలో1974 ఆగస్టు 6న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.
ఇంటర్మీడియట్లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐలో పనిచేశారు. అనంతరం గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరారు. 2001లో నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచారు.
ప్రజాదరణ కలిగిన ఈ నాయకుడు 2019 ఎన్నికలలో గెలిచి నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన బిఆర్ఎస్ వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర్ రావుకు మంచి అనుచరులలో ఒకరు. 2004 డిసెంబర్ లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులయ్యారు. 2005 లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయ్యారు..
పెద్ది సుదర్శన్ రెడ్డి 2013 వరకు టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి వ్యవహరిస్తూ వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు.. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015 పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయనకు 2018 ఎన్నికల్లో నర్సంపేట నుంచి అవకాశం దక్కింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో మళ్లీ నర్సంపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు.

More Stories
ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్!
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట
ఫీజు బకాయిలు రూ 15,000కోట్లు చెల్లింపుపై మాట తప్పారు