టీకాలు రెండు డోస్‌లు వేసుకున్న 76 శాతం మందికి కరోనా

వ్యాక్సిన్‌ ప్రభావంపై తీసుకున్న శాంపిల్స్‌పై జరిగిన అధ్యయనంలో వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు వేసుకున్న 76 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అంతేగాక కరోనా సోకిన వారిలో కేవలం 16 శాతం మందిలో మాత్రమే ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, 10 శాతం మంది చికిత్స కోసం ఆసుపత్రులలో చేరాల్సి వచ్చిందని అధ్యయనంలో తేలింది.  

దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, వైరస్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) చేసిన మొట్టమొదటి అధ్యయనం విడుదలైంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి జూన్‌ 10వ తేదీ మధ్య జరిగిన ఈ అధ్యయన సమయంలో 361మందికి ఆర్టీ–పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా, అందులో 274 మందికి పాజిటివ్‌గా తేలింది.

వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న 14 రోజుల తరువాత ఈ వ్యక్తులకు వైరస్‌ సంక్రమించినట్లుగా గుర్తించారు. కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్‌ తీసుకునే వారిలో 77 శాతం యాంటీబాడీలు మాత్రమే కనిపించాయని అధ్యయనంలో గుర్తించారు. మెడికల్‌ జర్నల్‌ రీసెర్చ్‌ స్క్వేర్‌లో ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకోని కారణంగా 87 శాంపిల్స్‌ను ఈ అధ్యయనం నుంచి మినహాయించారు.

అనంతరం జరిగిన దర్యాప్తులో వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న తరువాత 274 మందిలోనూ వైరస్‌ జాడను కనుగొన్నారు. వీటిలో 35 శాంపిల్స్‌(12.8%) కోవాగ్జిన్‌ రెండు డోస్‌లను తీసుకోగా, 239 శాంపిల్స్‌ (87.2%) కోవిషీల్డ్‌ రెండు డోస్‌లను తీసుకున్నారు. అంతేగాక కోవాగ్జిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న తరువాత వైరస్‌ సోకిన వారిలో 43 శాతం  మంది ఇటీవల వచ్చిన సెకండ్‌ వేవ్‌ సమయంలో కోవిడ్‌ వార్డుల్లో పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు.

అదే సమయంలో, కోవిషీల్డ్‌ తీసుకున్న తర్వాత 10 శాతం  మంది ఆరోగ్య కార్యకర్తలు సైతం వ్యాధి బారిన పడ్డారు. కోవిషీల్డ్‌ రెండు డోస్‌ల తర్వాత కరోనా వైరస్‌ సంక్రమణకు గురికావడం మధ్య సగటు వ్యవధి 45 రోజులుగా గుర్తించారు. అయితే ఈ సంక్రమణ సగటు వ్యవధి కోవాగ్జిన్‌ తీసుకునే వారిలో 33 రోజులుగా ఉంది.

అధ్యయనం సమయంలో కోవిషీల్డ్‌ రెండు డోస్‌లు వేసుకున్న ఒక వ్యక్తికి వైరస్‌ సంక్రమించి మరణించినట్లు ఐసీఎంఆర్‌ నిపుణులు నిర్ధారించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహారాష్ట్రకు చెందిన ఒకే ఒక్క రోగి మరణించినట్లు ప్రభుత్వం ఇప్పటివరకు సమాచారం ఇవ్వగా, ఈ అధ్యయనంలో దాని సమాచారం ఇవ్వలేదు. ఈ రెండు కేసులు భిన్నమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వ్యాక్సిన్‌ రెండు డోస్‌లను తీసుకున్న తరువాత కరోనా సోకిన వారిలో 9.9 శాతం  మంది అధ్యయన సమయంలో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. అయితే వీరు డిశ్చార్జ్‌ అయ్యేందుకు కనీసం 11 రోజులు పట్టిందని, ఒక రోగి ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని నివేదికలో పేర్కొన్నారు.

వ్యాక్సిన్లు వేసిన తరువాత కూడా డెల్టా వేరియంట్‌ సంక్రమణకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వేరి యంట్‌ యాంటీబాడీలను గణనీయంగా తగ్గిస్తుంది. దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జనవరి 16 నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చిలో వచ్చిన సెకండ్‌ వేవ్‌లో నమోదైన 80 శాతం మందికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌తో ముడిపడి ఉన్నాయి.

ఇది వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ వేరియంట్‌ కారణంగా వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న వారిపై కూడా కరోనా సంక్రమణ ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.