విజయవంతంగా పినాకా రాకెట్‌ ప్రయోగించిన డీఆర్‌డీఓ

ఒడిశా బాలాసోర్‌ తీరం చండీపూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్‌ అడ్వాన్స్‌డ్‌ రేంజ్‌ వెర్షన్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిందని అధికార వర్గాలు తెలిపాయి. 

మొత్తం 25 మెరుగైన పినాకా రాకెట్లను గురువారం, శుక్రవారాల్లో వేర్వేరు శ్రేణుల లక్ష్యాలకు వ్యతిరేకంగా వేగంగా పరీక్షించారు. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్ (ఎంబీఆర్ఎల్) నుంచి 122 ఎంఎం కాలిబర్ రాకెట్లను ప్రయోగించినట్లు ఒక అధికారి తెలిపారు. ‘ప్రయోగ సమయంలో మిషన్‌ అన్ని లక్ష్యాలు నెరవేరాయి.

పినాకా రాకెట్‌ సిస్టమ్‌ మెరుగైన శ్రేణి వర్షన్‌ 45 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను నాశనం చేయగలుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పినాకా అడ్వాన్స్‌డ్‌ రాకెట్లను విజయవంతంగా ప్రయోగించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, డీఆర్‌డీఓను అభినందించారు.

రాకెట్‌ వ్యవస్థను పూణేకు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) సంయుక్తంగా  నాగ్‌పూర్‌లోని ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ సహకారంతో అభివృద్ధి చేశాయి.