అరుణాచల్‌కు దగ్గర్లో చైనా బుల్లెట్‌ రైలు

భారత్‌కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్‌లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్‌ను శుక్రవారం ఆరంభించింది. అట్లాగే తొలి పూర్తిస్థాయి విద్యుత్ రైలు కూడా మార్గం కూడా ఇదే కావడం గమనార్హం. 

అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలోనే, మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ బుల్లెట్ రైలు దూసుకుపోతుంది. అత్యంత వ్యూహాత్మకంగానే చైనా అరుణాచల్‌కు అత్యంత సమీపంలో నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా మార్గాన్ని ఎంచుకుంది. 

చైనా ప్రాంతీయ రాజధాని లాహ్సాకు, టిబెట్‌లోని న్యింగ్చికి కలుపుతూ ఈ రైలు మార్గం ఏర్పడింది. ఇది సిచ్యూవాన్ టిబెట్ రైల్వేకు చెందిన లాహ్సా న్యింగ్చి సెక్షన్‌లో ఏకంగా 435 .5 కిలోమీటర్ల పొడవునా ఈ బుల్లెట్ ట్రైన్ విస్తరించుకుని పోతుంది. 

అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా తరచూ వాదిస్తూ భారత ప్రాదేశిక సర్వసత్తాకతకు తరచూ సవాలు విసురుతూ వస్తోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ వాదనకు విలువ లేకుండా పోయింది. దీనితో ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకే చైనా తన బుల్లెట్ ట్రైన్‌ను ఇక్కడ ప్రవేశపెట్టిందని భావిస్తున్నారు.

చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ వ్యక్తిగత ఆదేశాలతో ఆసక్తి కనబర్చడం వల్లనే ఈ బుల్లెట్ ట్రైన్ అత్యంత తక్కువ కాలంలోనే రూపుదిద్దుకుంది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్‌ను చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) శతజయంతి జులై 1న జరిగే నేపథ్యంలోనే ఆరంభించారు. ఈ ట్రైన్‌కు ఫ్యూక్సింగ్ అని పేరుపెట్టినట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.

సింగిల్ లైన్‌పై వేళ్లే ఈ రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. దీనిని ప్రయాణికులకు, సరుకు రవాణాకు వినియోగిస్తారు. ఈ రైలు మార్గం వెంబడి అత్యధిక సంఖ్యలో టన్నెల్స్, బ్రిడ్జిలు ఉంటాయి. టిబెట్ సింధుశాఖ ప్రాంతంలో వెళ్లే ఈ రైలు బ్రహ్మపుత్ర నదికి సమీపంలో నుంచి వెళ్లుతుంది.

ఈ రైలు మార్గం నిర్మాణ పనులను 2014లోనే చైనా మొదలు పెట్టింది.  ఆ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్‌ ఇది. ఈ రైలు మార్గంతో సిచువాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చెంగ్డూ నుంచి లాసా మధ్య ప్రయాణ సమయం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని చైనా అధికారిక మీడియా తెలిపింది. 

కాగా, సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ గతంలో పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ముసుగులో సరిహద్దుల్లోకి తమ బలగాలను వేగంగా తరలించేందుకే చైనా ఈ రైలు మార్గాన్ని నెలకొల్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి.