మరోసారి ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోనే పాకిస్థాన్

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మరోసారి పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడులను పొందడానికి పాకిస్థాన్‌కు అవకాశాలు ఉండవు.

ఈ జాబితా నుంచి బయటపడటం కోసం ఆ దేశం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెడుతుంది. ఈ సంస్థ ప్రకటించే గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్ మూడేళ్ళ నుంచి ఉంది. ఎఫ్ఏటీఎఫ్ చర్యల ప్రణాళికను అమలు చేయడం, అదే సమయంలో, ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారింది.

ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు పారిస్‌లో జూన్ 21 నుంచి 25 వరకు జరిగాయి. ఈ సంస్థ నిర్దేశించిన చర్యలను పాకిస్థాన్ పాటిస్తోందా? లేదా? అనే అంశంపై ఆసియా పసిఫిక్ గ్రూప్ నివేదికను ఎఫ్ఏటీఎఫ్ సమీక్షించింది. 

జూన్ ప్రారంభంలో ఎఫ్ఏటీఎఫ్ ప్రాంతీయ అనుబంధ సంస్థ పాకిస్థాన్‌ను ఎన్‌హాన్స్‌డ్ ఫాలో-అప్ జాబితాలో ఉంచింది. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ నిరోధక చర్యలను బలోపేతం చేయాలని తెలిపింది.