హుజూరాబాద్‌ లో లక్ష మెజార్టీయే బీజేపీ లక్ష్యం

హుజూరాబాద్‌ లో లక్ష మెజార్టీయే బీజేపీ లక్ష్యం

సీఎం కేసీఆర్ ఇప్పటికే వంద తప్పులు చేశారని, మరో తప్పు చేస్తే శిశుపాల వధ తప్పదని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జితేందర్ రెడ్డి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 

రావణాసురుడి లాంటి కేసీఆర్‌ దండు మీద పోరాటం సాగించాల్సిందేనని, హుజూరాబాద్‌లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులకు కూడా అపాయింట్‌‌మెంట్ ఇవ్వనిదే లోపలకు రావొద్దనే దరిద్రమైన పార్టీ టీఆర్ఎస్. అలాంటి దరిద్రమైన పార్టీ నుంచి గొప్ప పార్టీ అయిన బీజేపీలోకి ఈటల రాజేందర్ వచ్చారని అభినందించారు

“ఈటల కాషాయ కండువా వేసున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఈటలకు జరిగిన మోసాన్ని కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరించాలి. ఇంత బలగం మనకుండగా.. వాళ్లు డబ్బులెలా పంచుతారో చూద్దాం. మన కార్యకర్తలను ఒక్కరిని అరెస్టు చేస్తే వెయ్యి మంది అండగా ఉండి అరెస్టులకు సిద్ధం కావాలి” అని ఉపఎన్నిక ఇన్ ఛార్జ్ గా నియమితులైన ఆయన మార్గదర్శనం చేశారు.

టీఆర్ఎస్‌‌లో గుంటనక్కలుంటే తమ  దగ్గర సింహాల్లాంటి నేతలున్నారని భరోసా వ్యక్తం చేశారు. హుజురాబాద్‌‌లో ఈటల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల ఆత్మగౌరవ కోసం చేస్తున్న పోరు ఇది. ఈ ఎన్నికలో గెలవడం కాదు.. లక్ష మెజార్టీ సాధనే మన ధ్యేయం అని స్పష్టం చేశారు. నీతివంతమైన ఈటలకు అన్యాయం జరిగింది. బీజేపీ నాయకులు, గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లంతా పాలు, నీళ్లలా కలసి పనిచేయాలని  జితేందర్ రెడ్డి సూచించారు. 

దుబ్బాక విజయం హుజురాబాద్‌లో కూడా రిపీట్ అవుతుందని బిజెపి ఎమ్యెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘క్రికెట్‌‌లో అండర్ డాగ్ లాగా భావించే టీంలు కూడా వరల్డ్ కప్ సాధించినట్లుగా.. రాబోయే కాలంలో బీజేపీ విజయం సాధిస్తుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ తప్ప ఎవరూ గెలవరని సీఎం అనుకుంటే.. అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు లాంటి నేతలున్న చోటే నేను గెలిచా. అలాంటిది ఆరుసార్లు గెలిచిన ఈటల గెలవలేరా?’ అని ప్రశ్నించారు.

కాగా, హుజూరాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, రూరల్‌‌‌కు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంటకు ఎంపీ అర్వింద్, జమ్మికుంట రూరల్‌‌కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, కమలాపూర్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ లను బిజెపి ఇన్‌‌చార్జ్‌లుగా నియమించింది. బైపోల్ కోఆర్డినేటర్‌‌ బాధ్యతలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి అప్పగించింది. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిను నియమించారు.