యుపిలో బీజేపీ 300కు పైగా సీట్లు గెల్చుకొంటుంది!

వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్ లో  300 సీట్లకు పైగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.  “మేము చేసిన పనులతో ప్రజల మధ్యకు వెళ్తాము. రాబోయే అసెంబ్లీ  ఎన్నికల్లో బిజెపి 300 స్థానాలకు పైగా గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది ”అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇ-అడ్డాలో పాల్గొంటూ ఆదిత్యనాథ్ భరోసా వ్యక్తం చేశారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, పొలిటికల్ ఎడిటర్,  నేషనల్ బ్యూరో చీఫ్, రవిష్ తివారిలతో  జరిగిన గోష్టిలో ఆయన పలు అంశాలపై స్పందించారు. కోవిడ్ -19, ‘లవ్ జిహాద్’, 2022 రాష్ట్ర ఎన్నికలతో సహా పలు అంశాలపై మాట్లాడారు. కోవిడ్ -19  రెండవ వేవ్ మధ్య పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. 

 
 “పంచాయతీ ఎన్నికల కారణంగా యుపిలో కోవిడ్ -19 వ్యాపించిందని ప్రచారం చేస్తున్నారు. కొందరు ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. నేను వారిని ఒకటే  అడగాలనుకుంటున్నాను..మహారాష్ట్రలో లేదా ఢిల్లీలో  ఎన్నికలు ఉన్నాయా? అక్కడ కుంభ్ మేళా జరిగిందా? ” అని ప్రశ్నించారు.

‘లవ్ జిహాద్’ సందర్భంగా 2009 లో కేరళ హైకోర్టు ఈ పదాన్ని ప్రస్తావించిందని సిఎం గుర్తు చేశారు. “తరువాత, కర్ణాటక హైకోర్టు కూడా దానిపై ఒక ఉత్తర్వు జారీ చేసింది. పిల్లలు,  మహిళలను లక్ష్యంగా చేసుకున్నఇద్దరినీ మేము ఇటీవల అరెస్టు చేసాము… రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 100 కేసులు కనిపించాయి, ”అని ఆయన వివరించారు.  ఈ చట్టం ప్రజలందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసారు.

 
లక్నో రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న వివాదాలు, ప్రధాని మోదీతో తనకు వైరుధ్యం నెలకొన్నట్లు జరుగుతున్న ప్రచారం, తన మంత్రివర్గం పునర్నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు,  “ఇలాంటి పుకార్లు ఎప్పుడూ తలెత్తుతాయి. మేము వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మనమందరం వాటి నుండి ద్రుస్తి తప్పిస్తే మంచిది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 
 
ఉత్తర  ప్రదేశ్ లో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం గురించి నెలకొన్నవిమర్శల గురించి ప్రశ్నించగా,  “ఈ రోజు  ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ -19 కేసులు 208 మాత్రమే ఉన్నాయి. మా జిల్లాలో ఒకటి- మహోబా- పూర్తిగా కోవిడ్ రహితమైనది. 52 జిల్లాల్లోని కేసులు ఒకే అంకెలో ఉన్నాయి” అని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 3-4 సంవత్సరాలు ఎటువంటి సమస్య లేకుండా పనిచేశామని, అయితే  మార్చి 2020 తరువాత, కోవిడ్ -19 రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగించిందని ఈ సమయంలో కోవిద్ కట్టడి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ‘టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్’ అనే మంత్రంతో ఎప్పుడు తగు మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. సులభతరం వాణిజ్యం జాబితాలో 16వ స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ ఇప్పుటు 2వ స్థానంలోకి వచ్చినదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇలా ఉండగా, లక్నోలో తన మూడు రోజుల పర్యటనను ముగించిన తరువాత, అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బిఎల్ సంతోష్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కోవిడ్ టీకా కార్యక్రమాన్ని  ప్రశంసించారు. 

“జూన్ 21 న 7.25 లక్షల టీకాలు వేయడం వెనుక యుపి గత 24 గంటల్లో 8.1 లక్షల మందికి టీకాలు వేసింది. ఈ కార్యక్రమం ఉపందుకొంది. గుడ్ గోయింగ్ సిఎం ”అని ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ సంతోష్ ట్వీట్ చేశారు.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిబు   కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వంటి సీనియర్ పార్టీ నాయకులు కొందరు చెబుతున్న తరుణంలో ఆదిత్యనాథ్ పట్ల సంతోష్ ప్రశంసలు కురిపించడం ప్రాధ్యానత సంతరింప చేసుకొంది. 


మంగళవారం పార్టీ నాయకులు, మంత్రులతో తన సమావేశంలో నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ  అవగాహనతో పనిచేసే విధంగా చూడడం కోసం తగు మార్గదర్శనం చేసిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.  
సంతోష్‌తో పాటు లక్నో వచ్చిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు, యుపి ఇన్‌ఛార్జి రాధా మోహన్ సింగ్  పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. జూన్ 23 నుండి జూలై 6 వరకు జరగబోయే వివిధ కార్యక్రమాల్లో భాగంగా బూత్ స్థాయి సమావేశం జరిగినట్లు పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణ వార్షికోత్సవం జూన్ 23 నుండి, ఆయన జయంతి జూలై 6 వరకు సమగ్ర తోటల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యుపి బిజెపి తెలిపింది. 1975 లో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రోజు జూన్ 25 న పార్టీ వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.

మరోవంక, యూపీలో నాయ‌క‌త్వ మార్పు ఊహాగానాల‌కు బీజేపీ తెర‌దించింది. యోగి ఆదిత్యానాధ్ సార‌ధ్యంలోనే కాషాయ‌పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లను ఎదుర్కొంటుంద‌ని బీజేపీ ప్రధాన కార్యదర్శి  అరుణ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. ఇక యోగి ఆదిత్యానాధ్ యూపీ అభ్యున్న‌తికి విశేషంగా శ్ర‌మిస్తున్నార‌ని ఆయ‌నను మార్చాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని సింగ్ ప్ర‌శ్నించారు.