శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి ఘనంగా నివాళులు

ఈ రోజు(జూన్‌23) జనసంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేత‌లు ముఖ‌ర్జీకి నివాళులర్పించారు. 

శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, సమగ్రతల కోసం అంకితమయ్యారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అధికరణ 370, అధికరణ 35ఏల రద్దుకు ఉద్యమాన్ని ముఖర్జీ ప్రారంభించారన్నారు.  జమ్మూ-కశ్మీరును కాపాడటం కోసం కృషి చేశారని చెప్పారు. ముఖర్జీ వర్థంతి సందర్భంగా బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడ్డా మాట్లాడారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీకి పుష్పాంజలి ఘటించిన అనంతరం జేపీ నడ్డా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని ముఖర్జీ ప్రారంభించారని గుర్తు చేశారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీరును కాపాడటం కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. 

ముఖర్జీ వర్థంతి సందర్భంగా బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆయన జయంతి (జూలై 6) వరకు కొనసాగిస్తామని చెప్పారు. సమాజం, పర్యావరణం పట్ల తన బాధ్యతలను అర్థం చేసుకునే పార్టీ బీజేపీ అని చెప్పారు. కార్యకర్తలను సామాజిక సేవా కార్యక్రమాలవైపు ప్రోత్సహిస్తోందని తెలిపారు. 

దేశంలోని అనేక పార్టీల లక్ష్యం కేవలం రాజకీయాలు చేయడమేనని దుయ్యబట్టారు. బీజేపీకి సామాజిక దృక్పథం కూడా ఉందని తెలిపారు. సేవా హీ సంఘటన్, రక్త దానం, ఆక్సిజన్ సరఫరా, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పించిన అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 

కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి సందర్భంగా హౌజ్ ఖాస్‌లో ఒక మొక్క‌ను నాటారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తూ,  భోపాల్‌లో మొక్కలు నాటారు.