భారత సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు తగ్గాయని, కానీ పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు త్రివిధదళాల చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తుతం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు నిలిచిపోయాయని, ఇది పాజిటివ్ సంకేతమని చెప్పారు.
కానీ ఇదే సమయంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. డ్రగ్స్, ఆయుధాల వల్ల అంతర్గత శాంతి దెబ్బతింటుందని రావత్ తెలిపారు. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న కశ్మీరీ యువతను రక్షించుకోవాలని సూచించారు.
కశ్మీరీ యువతను గుర్తించి, ఉగ్రవాదం వల్ల జరిగే నష్టాల గురించి వారికి తెలియచెప్పాలని చెప్పారు. త్రివిధ దళాలను ఏకీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. మూడు రక్షణ దళాలు ఒక్కటైతే, భవిష్యత్తులో మనం దేన్నైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మరోవంక, భారత్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళాలు కాల్చివేశాయి. అతడి నుంచి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక్టార్‌లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్న వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్) గుర్తించింది.
అతడిని లొంగిపోవాలని కోరినప్పట్టికీ వినకపోవడంతో కాల్చివేశారు. అనంతరం అతని వద్ద 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
More Stories
నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
సంఘ్ పాటల ద్వారా సామరస్యం