`ఇండియా ‘అనే బానిస పేరును `భారత్’గా మార్చండి   

`ఇండియా ‘అనే బానిస పేరును `భారత్’గా మార్చండి   
 
దేశం పేరును `భారత్‌’గా మార్చాలంటూ సంచలన బాలివుడ్‌ నటి కంగనారనౌత్‌ డిమాండ్ చేశారు. `ఇండియా’ అనేది బానిస పేరు అని ఆమె స్పష్టం చేశారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన కూ అనే సామాజిక వేదికలో ఆమె ఈ విధంగా రాసుకొచ్చారు.
 
పాశ్చాత్య ప్రపంచానికి ప్రతిరూపంగా మన దేశం కొనసాగుతుంటే  భారత్‌ ఎప్పటికీ అభివృద్ధి సాధించలేదని కంగనా పేర్కొన్నారు. మన దేశంలోని ప్రాచీనమైన ఆధ్యాత్మిక విలువలను, జ్ఞానాన్ని విస్తరింపచేయడం వలనే భారత్‌ అభివృద్ధిని సాధింగలదని, అవి మన గొప్ప నాగరికతకు చిహ్నాలని ఆమె తెలిపారు.
 
ప్రపంచం భారత్‌ వైపు చూస్తోందని, మన నాగరికతను అభివృద్ధి చేయడంలో మనం ఉన్నత స్థాయికి చేరుకుంటేనే.. ప్రపంచాన్ని శాసించగలమని, లేకుంటే పాశ్చాత్య ప్రపంచానికి కాపీగానే మిగిలిపోతామని ఆమె హెచ్చరించారు. వేదాలు, భగవద్గీత, యోగాను విస్తరించేస్తే, ఈ బానిస పేరైన ఇండియా ను భారత్‌గా మార్చగలమని ఆమె సూచించారు. 
 
బ్రిటీష్‌ ప్రభుత్వం ఇండియా అనే బానిస పేరును ఇచ్చిందని, అంటే వాస్తవంగా సింధు నదికి తూర్పు అని అర్థమని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చెప్పారు. మనం మన పిల్లలన్ని తక్కువ జాతి, చిన్న ముక్కు ఇలా విచిత్రమైన పేర్లతో పిలవగలమా అని ఆమె ప్రశ్నించారు. వాటిని సమూలంగా మార్చేయాలని ఆమె స్పష్టం చేశారు. 
 
”భారత్‌కు అసలైన నిర్వచనం నేను చెబుతాను .. ఇది మూడు సంస్కృత పదాలతో మిళితమైంది .. భా (భావం) ర (రాగం) త (తాళం)” అని కంగనా వివరించారు. బానిసలుగా కావడానికి ముందు మనం ఎవరం అని ప్రశ్నిస్తూ మనం గొప్ప సాంస్కృతిక, కళాత్మక, నాగరికత కలిగిన వారమని ఆమె గుర్తు చేశారు. 
 
ప్రతి పేరుకు ఒక వైబ్రేషన్‌ ఉంటుందన్న విషయం బ్రిటీష్‌ వారికి తెలుసునని, అందుకే వారు వివిధ ప్రాంతాలకే కాకుండా, ప్రజలకు, ముఖ్యమైన చారిత్రాత్మక కట్టడాలకు కూడా పేర్లను ప్రకటించుకున్నారని కంగనా వివరించారు. మనం కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను తిరగి పొందాలని, అందుకోసం  ‘భారత్‌’ పేరుతో ప్రారంభిద్ధామని ఆమె బలమైన తన వాదనను వినిపించారు.