మావోయిస్టు అగ్ర నేత హరిభూషణ్‌ కరోనాతో మృతి!

మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్‌ (50) కరోనా బారిన పడి మరణించినట్టు  తెలుస్తోంది. దంతేవాడ జిల్లా సుకుమా తాలుకాలోని మీనాగూడ గ్రామంలో జూన్‌ 21న ఆయన చనిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 

ఇటీవల అనారోగ్యంతో మావో అగ్రనేత కత్తి మోహన్‌ అలియాస్‌ ప్రకాశ్‌ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో కలకలం రేపుతోంది. ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాలను తొలుత బస్తర్‌ పోలీసులు ధ్రువీకరించక  పోయినా, సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు హరిభూషణ్‌ మరణవార్తను నిర్ధారించారు.

హరిభూషణ్‌ ఆరోగ్య స్థితిగతులపై ఇటు మావోయిస్టులు అటు పోలీసులు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  2021 జూన్‌ 15న మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడ్డారంటూ పోలీసులు ప్రకటన చేయగా, దాన్నిమావోయిస్టు నేత అభయ్‌ ఖండించారు. మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకింది అనేది కేవలం పోలీసుల దుష్ప్రచారం అంటూ కొట్టి పారేశారు. 

ఈ ఘటన జరిగి వారం తిరక్క ముందే కరోనాతో హరిభూషణ్‌ మరణం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‍దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హరిభూషణ్‌ ఆలియాస్‌ యాప నారాయణ సొంతూరు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండ‌లం మడగూడ. 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కీలకమైన పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా కూడా ఉన్నారు.  గతంలో జరిగిన పువ్వర్తి, తడపలగుట్ట ఎదురు కాల్పులతో పాటు మరి కొన్ని సందర్భాల్లోనూ హరిభూషణ్‌ చనిపోయినట్టు  ప్రచారం జరిగినా, ప్రాణలతో బయటపడ్డాడు. 

హరిభూషణ్‌ దళంలో పని చేస్తున్న సమయంలోనే మేనమామ కూతురు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారదను వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది.

ఇటీవల తెలంగాణ – చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్ లో హరిభూషణ్‌ కీలక పాత్ర పోషించారు. ఏజెన్సీలో మరికొందరు మావోలు కూడా కరోనా బారినపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినోద్, రాజేశ్, ఇడుమా కూడా కరోనా బారినపడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అనారోగ్యంతో జూన్‌ 6న డివిజనల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, జూన్‌ 10న కత్తి మోహన్‌.. 16న విశాఖ ఎన్‌కౌంటర్‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్యలను ఇప్పటికే పార్టీ కోల్పోయింది.