ప్రధాని భేటీకి హాజరు కానున్న గుప్కర్‌ కూటమి

ప్రధాని భేటీకి హాజరు కానున్న గుప్కర్‌ కూటమి

ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్‌ కూటమి నేతలు ప్రకటించారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్షం సమావేశానికి సంబంధించి వ్యూహం సిద్ధం చేశారు.

 అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి తనతో పాటు పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, మహ్మద్‌ తారిగామి హాజరవుతారని ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు. సమావేశం ఎజెండా ఇవ్వలేదని, ఈ సందర్భంగా ప్రధాని, హోంమంత్రి ముందు తమ అభిప్రాయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ‘మా నుంచి తొలగించిన’ (ఆర్టికల్‌ 370) దానిపై మాట్లాడుతామని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ ఖైదీలను సైతం విడుదల చేయాలని కోరనున్నట్లు చెప్పారు.  ప్రధానితో సమావేశానికి ఆహ్వానించిన 14 మంది నాయకుల్లో,మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సైతం ఉన్నారు.

ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్‌ రాజకీయ కార్యకలాపాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. మొత్తం పరిస్థితిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపాదిత సమావేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.

పీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మెహబూబా ముఫ్తీకి అధికారం ఇవ్వగా. ఎన్‌సీ చీఫ్‌ పార్టీ ఎంపీలు, నాయకులు రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్ని పార్టీ సైతం సమావేశమై అభిప్రాయానికి వచ్చాయి.

అఖిలపక్షాల సమావేశానికి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు సహా 14 మంది నాయకులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ను విభజించిన తర్వాత ప్రధాన పార్టీలతో ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుండటం ఇదే మొదటిసారి.

ఈనెల 24న ఈ సమావేశం జరుగనుంది. కాగా, సమావేశంలో సింగిల్ పాయింట్ ఎజెండా మాత్రమే ఉంటుందని, ఎంపికైన ప్రజాప్రతినిధులకు సాధ్యమైనంత త్వరగా అధికారం అప్పగించడం, రాష్ట్రపతి పాలనకు ముగింపు పలకడం సమావేశం ఉద్దేశమని పీఎంఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.