మాజీ ప్రధాని దేవెగౌడకు రూ 2 కోట్ల జరిమానా

మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది.  ఆ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం ఉందని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి మల్లన గౌడ నిర్థరించారు. బీదర్ (దక్షిణ) మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ (నైస్) గురించి పదేళ్ళ క్రితం ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో దేవె గౌడ చేసిన వ్యాఖ్యలపై ఈ తీర్పు వెలువడింది.

2011 జూన్‌లో ఓ కన్నడ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌పై దేవెగౌడ వ్యాఖ్యలు చేశారు. పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు కోర్టులో పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేశారు.  దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం.. నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 2కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, నష్టపరిహారంగా దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్‌ఐసీఈ కంపెనీ డిమాండ్ చేసింది.

ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవగౌడ విఫలయ్యారని కోర్టు తేల్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని గౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు. ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు, హైకోర్టు తమ తీర్పుల్లో సమర్థించిన విషయాన్ని ప్రస్తావించింది. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతించినట్లయితే, భవిష్యత్తులో ఇటువంటి భారీ ప్రాజెక్టులను అమలు చేయడం కష్టమవుతుందని తెలిపింది. 

. 88 ఏళ్ల దేవెగౌడ దేశంలోని సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఒకరు. 1996 నుంచి 1997 మధ్య ఆయన దేశ ప్రధానిగా చేశారు. అంతకు ముందు 1994-96లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన కుమారుడు కుమారస్వామి సైతం కర్ణాటక సీఎంగా పని చేశారు.