ప్రజలు తిరస్కరించిన నేతల పగటి కలలు!

ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నివాసంలో మంగళవారం ఢిల్లీలో పలువురు ప్రతిపక్ష నేతలు సమావేశం కావడాన్ని ప్రజలు తిరస్కరించిన నేతల పగటి కలలుగా బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అభివర్ణించారు. 

 ప్రజల తిరస్కరణకు పదే పదే గురైన నేతలు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారని పేర్కొంటూ పగటి కలలు కనడం నుంచి ఎవరినీ ఆపలేమని ఆమె ఎద్దేవా చేశారు. ఆమె ఓ వార్తాసంస్థతో  మాట్లాడుతూ, పదే పదే ప్రజల తిరస్కరణకు గురైన నేతలు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారని పేర్కొన్నారు. 

ఇలాంటి సమావేశాలు జరగడం కొత్త విషయమేమీ కాదని ఆమె కొట్టిపారవేసారు. ఎన్నికల ద్వారా లాభాలు ఆర్జించే కంపెనీలు కొన్ని ఉన్నాయని చెప్పారు. ఆ కంపెనీలు ప్రతి నేతనూ తదుపరి ప్రధాన మంత్రిగా ప్రచారం చేస్తూ ఉంటాయని ఆమె ఎద్దేవా చేశారు. పగటి కలలు కనకుండా ఎవరినీ ఆపలేమని చెప్పారు. 

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీజేపీయేతర పార్టీలతో శరద్ పవార్ నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, బాలీవుడ్ ప్రముఖుడు జావేద్ అక్తర్, రాష్ట్రీయ లోక్‌దళ్ ప్రెసిడెంట్ జయంత్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఐ ఎంపీ బినయ్ విశ్వం, కొందరు మేధావులు హాజరయ్యారు. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై వీరంతా చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు కానీ, వారికి సంబంధించినవారు కానీ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. 

కాగా, భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు మూడో ఫ్రంట్ కానీ, నాలుగో ఫ్రంట్ కానీ వస్తుందనే నమ్మకం తనకు లేదని  ప్రశాంత్ కిశోర్ పేర్కొనడం గమనార్హం. ‘‘ప్రస్తుత ప్రభుత్వాన్ని విజయవంతంగా సవాల్ చేయగలిగే థర్డ్ లేదా ఫోర్త్ ఫ్రంట్ వస్తుందనే నమ్మకం నాకు లేదు’’ అని ఓ టివి ఛానల్ లో మాట్లాడుతూ స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రయోగం గతంలో జరిగిందని, దీనికి పరీక్షలు ఎదురయ్యాయని, ఇది పాతబడిపోయిందని ఆయన చెప్పారు.