లష్కరే తోయిబా ముదాసిర్ పండిట్ హతం

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. సోపోర్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మృతుల్లో లష్కర్ ఏ తోయిబా కు చెందిన  టాప్ కమాండర్  ముదాసిర్ పండిట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. 
 
ముదాసిర్ పండిట్ ముగ్గురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు పౌరులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఇక మృతుల్లో పాకిస్థాన్ కు చెందిన అస్రర్ అలియాస్ అబ్దుల్లా కూడా మృతుల్లో ఉన్నారని చెప్పారు. 
 
2018 నుంచి నార్త్ కశ్మీర్ లో అబ్దుల్లా యాక్టివ్ గా పని చేస్తున్నాడని చెప్పారు. సోపోరిలోని గుండ్ బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. 
 
సోపోర్‌లో సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆదివారం అర్థరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. 
 
దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరింత మంది ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో గాలింపు కొనసాగుతుందని తెలిపారు.