బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత హింస‌పై ఎన్‌హెచ్ఆర్సీ క‌మిటీ

బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత హింస‌పై ఎన్‌హెచ్ఆర్సీ క‌మిటీ

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌పై న‌మోదైన కేసుల‌పై ద‌ర్యాప్తు చేసేందుకు ఏడుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్సీ) ఛైర్‌ప‌ర్స‌న్ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా సోమ‌వారం నియ‌మించారు. ఎన్‌హెచ్ఆర్సీకి చెందిన సభ్యుడు రాజీవ్ జైన్ కమిటీకి అధిపతిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 

జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్‌పర్సన్ అతిఫ్ రషీద్, జాతీయ మహిళా కమిషన్ స‌భ్యుడు (డాక్టర్) రాజుల్‌బెన్ ఎల్. దేశాయ్, ఎన్‌హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహ్రా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రిజిస్ట్రార్ ప్రదీప్ కుమార్ పంజా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీ రాజు ముఖర్జీ, ఎన్‌హెచ్ఆర్సీ డీఐజీ (ఇన్వెస్టిగేషన్) మన్జిల్ సైని సభ్యులుగా ఉన్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల కేసుల‌ను ప‌రిశీలించేందుకు ఒక క‌మిటీని నియ‌మించాల‌ని జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాన్ని కోల్‌క‌తా హైకోర్టు ఈ నెల 18న‌ ఆదేశించింది. 

అయితే ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ అధికారుల‌కు వ్యతిరేకంగా ఉన్న‌ ఈ తీర్పును వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ బెంగాల్ ప్ర‌భుత్వం ఒక పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమ‌వారం ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించి తిరిస్క‌రించింది. ఈ నేప‌థ్యంలో ఎన్‌హెచ్ఆర్సీ ఏడుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది.