కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడడంలో కేసీఆర్ విఫలం

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడడంలో సీఎం కేసీఆర్ విఫలం అయ్యారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. 2011లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి 1005 టిఎంసిలు కేటాయిస్తూ అవార్డు ఇచ్చింది. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున అవార్డు ఇంకా ప్రచురించలేదు. ఇంతలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. 

ఐఎస్ఆర్డబ్ల్యుడి చట్టం, 1956 సెక్షన్-3 కింద నాలుగు రాష్ట్రాలకు- మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఎపిలకు నీటి కేటాయింపు చేయడానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కెసిఆర్ ప్రభుత్వం 2015లో సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో కొనసాగుతూ ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నందున ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 సెక్షన్-89 కింద తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుపై విచారణ చేపడుతామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్  2016లో తన అభిప్రాయాన్ని తెలియజేసింది. విచారణ ఇంకా కొనసాగుతోందని త్లెఇపారు.

ఐఎస్ఆర్డబ్ల్యుడి చట్టం, 1956 సెక్షన్-3 కింద కొత్త ట్రిబ్యునల్‌కు కేంద్రం ఈ అంశాన్ని అప్పజెప్పలేదని కేసిఆర్ ఈ 7 ఏళ్లుగా కేంద్రాన్ని నిందిస్తూ వచ్చారు. తెలంగాణ కేసు దాఖలు చేయడంతోనే ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, సుప్రీం తీర్పు వెలవడే వరకు అలా చేయడం కుదరదని కేంద్రం చెప్తూ వస్తోంది. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని ఇన్నేళ్లుగా కేంద్రం ఇచ్చిన సలహాను కేసీఆర్ చెవికెక్కించుకోలేదని విమర్శించారు.

గత ఏడాది ఎపి చట్టవిరుద్ధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణం ప్రారంభించినప్పుడు నేను కేంద్ర జల్ శక్తి మంత్రి  గజేంద్ర సింగ్ షెఖావత్ గారికి లేఖ రాస్తూ ఎపి అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరాను. దీంతో పాటు అపెక్స్ కౌన్సిల్‌ సమావేశపర్చి ఈ విషయంపై చర్చించాలని అభ్యర్థించాను. దీంతో షెకావత్ గారు 6 అక్టోబర్ 2020న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసారు. 

సుప్రీం కోర్ట్ లో వేసిన కేసును తెలంగాణ ఉపసంహరించుకుంటే, కేంద్రం న్యాయ సలహాలు తీసుకొని, ఐఎస్ఆర్డబ్ల్యుడి చట్టం, 1956 సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ కు సూచించే అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే కేసును ఉపసంహరించుకునేందుకు కెసిఆర్ కు 8 నెలలు పట్టిందని సంజయ్ ఎద్దేవా చేశారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో షెఖావత్ సూచించినప్పుడే 2020 అక్టోబర్‌లో కేసును ఉపసంహరించుకుంటే, ఈ సమయానికి ట్రిబ్యునల్ దీనిపై విచారణ చేపట్టేది, ఈ అంశంలో చాలా పురోగతి ఉండేదని చెప్పారు. కెసిఆర్ గత 6 సంవత్సరాల నుండి ఈ కేసును ఉపసంహరించుకోకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారని సంజయ్ ధ్వజమెత్తారు. 

కేసీఆర్ అనాలోచిత చర్యల వల్ల తెలంగాణ ప్రజలకు కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా దక్కలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడమూ ప్రధాన కారణం అని గుర్తు చేశారు. కెసిఆర్ ‘తుగ్లక్’ ప్రవర్తన కృష్ణ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,  కేంద్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిశీలిస్తుందని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.