
అన్‌లాక్ కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దాంతో వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుందని చెప్పారు. హాట్‌స్పాట్లలో తగిన నిఘా అవసరమని సూచించారు. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ కుండా ఉండటం లాంటి జాగ్రత్తలను ఏమేరకు అవలంభిస్తారనే దానిపై థర్డ్ వేవ్ రాక ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
‘కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రజలు బయటికి రావడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్ వేవ్స్ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు’ అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
దేశం లోని జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం తగ్గించడం సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటి, రెండు వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలని కోరారు. రోజువారీ కేసులు 4 లక్షలు దాటిన సంఘటనలు కూడా అనుభవమయ్యాయని, రోజువారీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఉదహరించారు.
కానీ అనేక రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో కనీస కొవిడ్ నిబంధనలు పాటించకుండా జనం మళ్లీ భారీగా గుమికూడుతున్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. డెల్టా వేరియంట్ ప్రభావంతో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని తెలియడంతో ఆయన పైవిధంగా హెచ్చరించారు.
‘ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ గతంలోని వేరియంట్స్‌తో పోలిస్తే మరింత బలమైంది. దీని సంక్రమణ వేగం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. యూకేలో డెల్టా వేరియంట్ మ్యూటేషన్ చెందుతోంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వేవ్స్ మధ్య గ్యాప్ తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు.
సూక్ష్మస్థాయిలో యాజమాన్య పద్ధతులు (మైక్రోమేనేజ్‌మెంట్) అంటే మినీ లాక్‌డౌన్లు పద్ధతిని ప్రవేశ పెడితే కరోనా మూడోదశను చాలావరకు తగ్గించ వచ్చని సూచించారు. 5 శాతం కన్నా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మినీ లాక్‌డౌన్లు పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సామూహిక టీకా కార్యక్రమం ముమ్మరం చేయాలని చెప్పారు.
వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో చూడటానికి మనకు అగ్రెసివ్ జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరం. వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుందా, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స పని చేస్తుందా? అనే డేటాను అధ్యయనం చేసేందుకు అధునాతనమైన పరిశోధనశాలల వ్యవసలు ఉండాలని సూచించారు.
More Stories
బనకచర్లను ఆపేయాలి.. తెలంగాణ ఎంపీలు
పాకిస్థాన్‌ను ఉపేక్షించడం అమానుషానికి తావు ఇవ్వడమే
ఇరాన్ నుండి 10వేల మందికి పైగా భారతీయుల తరలింపు!