24న జమ్మూకాశ్మీర్‌ పార్టీలతో ప్రధాని మోదీ భేటీ 

జమ్మూ కాశ్మీర్ లో సాధారణ రాజకీయ పక్రియ పునరుద్ధరణ దిశలో గత ఏడాది జిల్లా అభివృద్ధి మండలిల ఎన్నికలను విజయవంతంగా జరిపిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తిరిగి రాష్ట్ర హోదా కల్పించి, అసెంబ్లీ ఎన్నికలు జరిపే దిశలో కీలకమైన ముందడుగు వేస్తున్నది. ఈ నెల 24న ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 

కేంద్ర పాలిత ప్రాంతాన్ని తిరిగి రాష్ట్రంగా మార్పు, ఎన్నికల నిర్వహణ, ఇతర ముఖ్య అంశాలపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2019, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌ను కేంద్ర భూభాగాలుగా విభజించడం తెలిసిందే.

హోమ్ మంత్రి అమిత్ షా గత సాయంత్రం జరిపిన రెండు  అత్యున్నతస్థాయి సమావేశంలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలలో సరిహద్దు ప్రాంతంలోని భద్రత, అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిపారు. రెండు సమావేశాలలో కూడా జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ కార్యదర్శి అజయ్ భల్లా పాల్గొన్నారు.

భద్రతా అంశాలపై జరిగిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, కేంద్ర నిఘా సంస్థలు, భద్రతా సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ సమగ్రాభివృద్ధికి తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సమావేశాలలో స్థానికులకు ఉపాధి కల్పన, రైతుల ఆదాయం పెంపొందించడం, ప్రధాన మంత్రి ప్యాకేజి కింద చేపట్టిన పధకాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (తూర్పు పాకిస్థాన్) శరణార్ధుల పునరావాసం వంటి అంశాలపై హోమ్ మంత్రి  సమీక్ష జరిపారు.

కశ్మీర్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ 76 శాతం వరకు పూర్తి చేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు ఆయన అభినందనలు తెలిపారు. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని కొనియాడారు.  పారిశ్రామిక విధానం ప్రయోజనాలను చిన్న తరహా పరిశ్రమలు అందుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ సభ్యులకు శిక్షణ అందించాలని, దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన పంచాయతీల్లో వారు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

వచ్చేవారం జరిగే సమావేశానికి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్ లోనెతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలకు సమాచారం అందించినట్లు తెలిసింది. తనకు ఈ సమావేశం గురించి అధికార వర్గాలు టెలిఫోన్ లో తెలిపినట్లు మెహబూబ్ ముప్తి నిర్ధారించారు. ఎనిమిది రోజుల క్రితమే కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్  కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా ప్రకటించడం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు  పూర్వరంగం సిద్ధం చేసేందుకు గత ఏడాదే మార్చ్ లో  కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన కమీషన్ ను ఏర్పాటు చేసింది. జస్టిస్ రాజేంద్ర ప్రకాష్ దేశాయ్ ఈ కమీషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

మొత్తం 20 జిల్లాల డిప్యూటీ కమీషనర్ల గత మంగళవారం ఈ కమీషన్ జనసాంద్రత, భౌగోలిక స్వరూపం వంటి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా సమాచారం వివరాలు మొత్తం పంపమని కోరుతూ లేఖలు వ్రాసింది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలు ఆ సమాచారాన్ని అందించిన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటి వరకు పునర్విభజన కమిటీ సమావేశాలకు నేషనల్ కాన్ఫరెన్స్ దూరంగా ఉంటున్నది. కాగా, కాశ్మీర్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, భద్రతా పరిస్థితులు  మెరుగయ్యాయని, అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకొంటున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.