మాయావతిని ఎవరూ విశ్వసించడం లేదా! 

మరి కొద్దీ నెలల్లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో కీలకమైన బహుజన సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీచేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా ఎన్నికల నాటికి ఆమె పార్టీలో ఇంకెవ్వరు మిగులుతారో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 
 
వివిధ సందర్భాలలో ఆమె ఒక్కక్క పార్టీతో పొత్తు పెట్టుకొంటూ, దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. 
ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి, కాంగ్రెస్‌, బిజెపి సహా అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతిని వచ్చే ఎన్నికల్లో ఎవరూ విశ్వసించే అవకాశాలు కనపడడం లేదు. 
 
దానితో ఆమె ఒంటరిగా పోరుకు సిద్ధం కావలసి వస్తున్నది. ఎన్నికల పొత్తు ఒప్పందాలను ఉల్లంగించడంలో ఆమెకు మరెవ్వరు సాటిరారని దాదాపు ప్రతి పార్టీ సొంత అనుభవంతో గ్రహించడమే అందుకు కారణం.  మొదటగా బీజేపీతో పొత్తు పెట్టుకొని,  చేరి సగం కాలం అధికారంలో ఉండడం కోసం ఒప్పుకొని, తాను ముఖ్యమంత్రిగా పదవీకాలం పూర్తి చేసి, ఆ తర్వాత బిజెపికి మద్దతు ఇవ్వకుండా మాట తప్పారు. ఇతర పార్టీలతో కూడా ఆమె ఆ విధంగానే వ్యవహరించారు. 
 
తండ్రి ములాయంసింగ్ యాదవ్ వద్దని చెప్పినా వినకుండా,  ఆమెతో పొత్తు పెట్టుకొని నష్టపోయామని, ఓటమి ఎదుర్కోవలసి వచ్చినదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వాపోవడం తెలిసిందే. 
 
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌పితో చేతులు కలిపి 10 సీట్లు గెలుచుకున్న బిఎస్‌పి.. ఆ తర్వాత 11 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3,050 జిల్లా పంచాయత్‌ సీట్లలో ఎస్‌పికి 782, బిజెపికి 580 సీట్లు రాగా.. బిఎస్‌పికి 336 సీట్లు లభించాయి. 
 
ఒక్క బుందేల్‌ ఖండ్‌లో మాత్రమే మాయావతి అత్యధిక ప్రభావం చూపగా, మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఆకట్టులేకపోయారు. నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎస్‌పి, బిఎస్‌పి దాదాపు సమాన బలాన్ని ప్రదర్శించాయి.  2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 39.7 శాతం ఓట్లతో 312 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా,  ఎస్‌పి, బిఎస్‌పిలకు దాదాపు 22 శాతం చొప్పున ఓట్లు వచ్చినప్పటికీ.. ఎస్‌పికి 47 సీట్లు, బిఎస్‌పికి 19 సీట్లే లభించాయి. 
 
ఈ క్రమంలోనే ఇద్దరూ చేతులు కలిపితే ఫలితం ఉండవచ్చన్న ఉద్దేశంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. ఎస్‌పి ఓట్లు బిఎస్‌పికి బదిలీ అయినప్పటికీ బిఎస్‌పి ఓట్లు ఎస్‌పికి బదిలీ కాలేదని వివిధ సర్వేల్లో తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్‌పి క్రమంగా బలాన్ని పెంచుకుంది.
 
మాయావతిని ఎవరూ విశ్వసించకపోవడం, గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు శాతం కూడా తగ్గడంతో బిఎస్‌పితో పొత్తు పట్ల ఎవ్వరు ఆసక్తి చూపడం లేదు. ప్రధాన పార్టీలేవీ తనతో జట్టుకట్టేందుకు సిద్ధపడకపోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి మజ్లిస్‌ పార్టీ (ఎంఐఎం)తో పొత్తు పెట్టుకుని తన ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఇదేగనుక జరిగితే, ఈ పొత్తు వల్ల బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోయి, బిజెపికే ఎక్కువ లాభం చేకూరుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు సమాజ్‌వాది పార్టీ.. ఆర్‌ఎల్‌డి, కాంగ్రెస్‌, ఎస్‌బిఎస్‌పి, ఎఎస్‌పిలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఆమె తగు బలం ప్రదర్షింపలేని పక్షంలో ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకరం అయ్యే అవకాశాలున్నాయి.