బెంగాల్ ను రాజ్యాంగ సంక్షోభం వైపు నెట్టుతున్న మమతా!

నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్‌ వేయడం, ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కౌశిక్‌ చందా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టడం గమనిస్తే రాజ్యాంగపరమైన సంక్షోభంకు సిద్దమవుతూ టిఎంసి అధినేత్రి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఎన్నికల ఫలితం ప్రకటించిన 45 రోజుల లోగా ఎన్నికల పిటిషన్ వేయవలసి ఉండడంతో, ఆమె  ఆ క్రమంలో ఈ పిటిషన్ వేశారని భావించలేము. నందిగ్రామ్ లో ఆమె ఓటమి చెందినా ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఆరు నెలల లోగా మరో నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక కావలసి ఉంది.
అయితే కరోనా మహమ్మారి దృష్ట్యా ఆరు నెలలలోగా ఆమె అనుకున్న నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగని పక్షంలో,  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఉండేందుకు ఆమె  రాజ్యాంగ సంక్షోభం సిద్ధం కావడానికి ఆమె పూర్వరంగం ఏర్పాటు చేసుకొంటున్నారా? అనే అనుమానం కలుగుతున్నది.
ఈ విధంగా రాజీనామా చేయకుండా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం కోసం ఆమె పూర్వరంగం ఏర్పర్చుకొంటున్నారా? గోవర్నర్, కేంద్ర హోమ్ శాఖా జోక్యం చేసుకొని ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టక తప్పని పరిస్థితులు కల్పించడం ద్వారా ప్రజల సానుభూతి పొందేందుకు ఎత్తుగడ వేస్తున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. 
 
2011 నుండి ఆమె గెలుస్తూ వచ్చిన భవానీపూర్ నియోజకవర్గం నుండి తిరిగి పోటీ చేయాలనే ఆమె సంకల్పించారు. అందుకు అవకాశం కల్పిస్తూ అక్కడి నుండి గెలుపొందిన ఆమె వ్యవసాయ మంత్రి సోమందేబ్ చట్తోపాధ్యాయ్ గత నెలలోనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంతో, ఆయన మరో నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికలో పోటీ చేసి, గెలుపొందవలసి ఉంది.
 
గత మార్చ్ – ఏప్రిల్ లో అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడిన రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో సత్వరం ఎన్నిక జరపవలసిన బాధ్యత ఎన్నికల కమీషన్ పై  ఉంది. అవి ముర్షిదాబాద్ – షంషేర్ గుంజ్, జంగిపూర్. షంషేర్ గుంజ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేజముల్ కరీం చనిపోవడంతో, జంగిపూర్ లో ఆర్ ఎస్ పి అభ్యర్థి ప్రదీప్ నంది చనిపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీరిద్దరూ కరోనా కారణంగా చనిపోయారు. 
 
ఈ రెండు నియోజకవర్గాలలో మే 12 న ఎన్నికలు జరుగవలసి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కరోనా పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో వాయిదా వేశారు. ఈ లోగా మరో నాలుగు సీట్లు  కూడా ఖాళీ అయ్యాయి. పార్లమెంట్ సభ్యులైన ఇద్దరు బిజెపి ఎమ్యెల్యేలు – నితీష్ ప్రామాణిక్, జగన్నాథ్ సర్కార్ శాసనసభ్యత్వాలకు నాటబరి, శాంతిపూర్ స్థానాలకు రాజీనామా చేశారు. 
 
ఇక, ఖర్ధలో గెలుపొందిన టిఎంసి అభ్యర్థి కరోనా కారణంగా చనిపోయారు. ఈ మూడు సీట్లకు కూడా ఉపఎన్నికలు జరుగవలసి ఉంది. అంటే మొత్తం మీద ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగవలసి ఉంది. అయితే, ముందుగా ఎన్నికల తేదీ ప్రకటించినా, అర్ధాంతరంగా వాయిదా పడిన రెండు స్థానాలలో ముందుగా ఎన్నికలు జరపడం పైన ఎన్నికల కమీషన్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 
 
సభ్యుల రాజీనామా కారణంగానో, ఎన్నికైన తర్వాత మృతి చెందడం వల్లననే ఖాళీ అయినా స్థానాలలో ఉపఎన్నికలు ఆరు నెలల లోగా ఎప్పుడైనా జరుపవచ్చు. మమతా కోసం సీట్ త్యాగం చేసిన వ్యవసాయ మంత్రి చట్తోపాధ్యాయ్ ఖర్ధ నుండి పోటీ చేయనున్నారు. 
 
అయితే కరోనా రెండో వేవ్ ఉధృతంగా ఉండడంతో, ఎప్పుడు ఉపఎన్నికలు జరపాలన్నది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం ఎన్నికల కమీషన్ విచక్షణ పై ఆధారపడి ఉంటుంది. సొంతంగా యంత్రాంగం లేకపోవడంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు అందించే సమాచారంపైన ఎక్కువగా కమీషన్ ఆధారపడవలసి ఉంటుంది. 
 
తమిళనాడులో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా జరిపారని ఎన్నికల కమీషన్ ను మద్రాస్ హైకోర్టు నిలదీయడం తెలిసిందే. అందుకనే ఆరు నెలల లోగానే ఉపఎన్నికలు జరపాలని ఎన్నికల కమీషన్ పై చట్టపరంగా వత్తిడి ఉండదు. ఎన్నికలు జరుపలేని పక్షంలో ఆరు నెలలలోగా మమతా బెనర్జీ శాసనసభకు ఎన్నిక కాలేరు. 
 
అటువంటి సమయంలో ఆమెను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమని ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకు రావడమో, బిల్లు ఆమోదించడమో చేయవలసి ఉంది. ఆమె కోసం కేంద్రం ఆ విధంగా చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. 
 
అందుకనే, తనపై బిజెపి అభ్యర్థిగా సువెందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, ఒక అభ్యర్థి ఎన్నికను ఎన్నికల కమీషన్ మాత్రమే నిర్ధారించాలని సుప్రీం కోర్ట్ అనేక తీర్పులలో స్ఫష్టం చేసింది. ఈ అంశాలను హైకోర్టు పరిశీలింపలేదు. లేని పక్షంలో సుప్రీం కోర్ట్ మాత్రమే పరిశీలించాలి. కేవలం ఎన్నికల ప్రకటన సందర్భంగా సాంకేతిక పరమైన అంశాలను ఏమాత్రం పాటించారో మాత్రమే హైకోర్టు చూడగలదు. 
 
పైగా, ఆమె పిటిషన్ విచారణ చేపట్టిన కొలకత్తా హైకోర్టు జడ్జి కౌశిక్ చంద్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కు స్నేహితుడు టిఎంసి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో బిజెపి  సభ్యుడని చెబుతూ అభ్యంతరం లేఖను మమతా న్యాయవాది సంజయ్ బసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ కు లేఖ అందజేశారు. 
 
అందుచేత కోర్ట్ విచారణ నిస్పక్షపాతంగా ఉండే అవకాశం లేదని పేర్కొంటూ,  ఈ కేసును మరో బెంచ్ కు మార్చాలని కోరారు. హైకోర్టు యాక్టింగ్ న్యాయమూర్తిగా ఉన్న కౌశిక్ చంద్రను శాశ్వత న్యాయమూర్తిగా నియమించవద్దని కోరుతూ మమతా అభ్యంతరం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
అందుకనే ఆ జడ్జి పూర్వాపరాలను ప్రశ్నిస్తూ టిఎంసి ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కౌశిక్ చంద్ర దిలీప్ ఘోష్ తో కలసి బిజెపి వేదికలను పంచుకున్న రెండు ఫోటోలను జతచేసారు. న్యాయవాదిగా హైకోర్టు లో పలు బీజేపీ కేసులను కూడా వాదించారని తెలిపారు.  
 అయితే ఆయన బిజెపి సభ్యుడన్న విషయం తనకు తెలియదని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. గతంలో, ఐదారేళ్ళ క్రితం తమ లీగల్ సెల్ లో ఉండే ఉండవచ్చని, అందుకు ఇప్పుడు అభ్యంతరం పెట్టడంలో అర్ధం లేదని విమర్శించారు. 
 
ఇప్పుడు అసలు ప్రశ్న, ఆరు నెలలలోగా ఉపఎన్నికలు జరుగక ఎమ్యెల్యేగా ఎన్నిక కాలేని పక్షంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? నందిగ్రామ్ ఎన్నిక ఫలితాలు న్యాస్థానంలో ప్రశ్నార్ధకరంగా ఉండండతో తనను రాజీనామా చేయమని కోరడం `సబ్ జుడీస్’ అని వాదిస్తారా? అప్పుడు ప్రతిపక్ష నేత సువెందు అధికారి హోదాను సహితం ఆమె ప్రశ్నార్ధకరంగా మారుస్తారా?