భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం మిల్కాసింగ్ మృతి 

కోవిడ్ అనంతర సమస్యల కారణంగా భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం, స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం మరణించారు. కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న 91 ఏండ్ల మిల్కాసింగ్‌కు జ్వరంతో పాటు ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గడంతో ఐసీయూకు తరలించారు.

నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. 1956, 1964 ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగిన ఈ పంజాబీ వెటరన్‌కు 1959లో పద్మశ్రీ అవార్డు దక్కింది.  మిల్కాసింగ్‌ భార్య నిర్మల్‌కౌర్‌ (85) మొహాలీలో గత ఆదివారం అదే ఆసుపత్రిలో కరోనాతో మరణించారు. ఆమె భారత్ వాలీబాల మాజీ కెప్టెన్. 

మే 24 న “కోవిడ్ న్యుమోనియా” కారణంగా ఆయ‌న‌ మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసియులో చేరాడు. అనంతరం జూన్ 3 న చండీగర్‌లోని పిజిఐఎంఆర్‌కు తరలించారు.కోవిడ్ అనంతర సమస్యల కారణంగా అతని భార్య నిర్మల్ మరణించిన ఐదు రోజుల తరువాత మిల్కా సింగ్ మరణించారు.

మిల్కా సింగ్ జూన్ 18 రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు అతని కుటుంబం ప్రకటించింది. అథ్లెట్‌ మిల్కాసింగ్‌ (91) మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. మిల్కాసింగ్‌ మరణం తనను కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. 

‘మిల్కా మరణం నా హృదయాన్ని దుఃఖంతో నింపేసింది. జీవితంలో మిల్కా ఎదుర్కొన్న కష్టాలు, ఆయన బలమైన వ్యక్తిత్వం.. భారత్​లో అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

 ‘దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది. కోట్లాది మంది హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’ అని ప్రధాని నరేంద్ర మోదీ  ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, పంజాబ్‌ ముఖ్యమంత్రి  అమరిందర్‌ సింగ్‌ సైతం మిల్కాసింగ్‌కు నివాళులర్పించారు. 

‘ఫ్లయింగ్ సిక్కు’ గా ప్రసిద్ది చెందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పేరు తెచ్చుకున్నాడు, ఆసియా క్రీడలలో నాలుగు బంగారు పతకాలు సాధించాడు. కార్డిఫ్‌లో 1958 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు, ఒలింపిక్ పతకాన్ని తృటిలో కోల్పోయాడు, 1960 రోమ్ గేమ్స్ 400 మీటర్ల ఫైనల్లో నాల్గవ స్థానంలో నిలిచాడు.

మిల్కా సింగ్ 45.73 సెకన్లలో రేసును ముగించాడు. 1998 లో పరంజీత్ సింగ్ దీనిని అధిగమించడానికి ముందు ఇది దాదాపు 40 సంవత్సరాలు జాతీయ రికార్డుగా ఉంది.

ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న గోబిందపురాలో జన్మించిన ఆయన, దేశ విభజన సమయంలో తన తల్లితండ్రులను, ముగ్గురు సోదరులను కోల్పోయిన ఆయన  పాకిస్థాన్ నుండి ఒక సైనిక ట్రక్ లో ఫెరోజపూర్ కు చేరుకున్నారు. సైన్యంలో చేరే రెండు ప్రయత్నాలు విఫలమైన తర్వాత, మూడోసారి సికింద్రాబాద్ లో ఎంపికయ్యారు.

అంతర్ సర్వీస్ పోటీలలో గెలుపొందిన తర్వాత మొదటిసారిగా 1956లో మెల్బోర్న్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు పందెంతో తన యాత్ర ప్రారంభించి, అప్పటి నుండి నూతన జాతీయ రికార్డులు నెలకొల్పడం ప్రారంభించారు.