సాగు చట్టాల రద్దు ప్రసక్తి లేదు… రైతులతో చర్చలకు సిద్ధం!

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని వ్య‌వ‌సాయ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ మరోసారి స్ప‌ష్టం చేశారు. అయితే చ‌ట్ట నిబంధ‌న‌లపై రైతుల‌తో సంప్ర‌దింపుల‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ప్రకటించారు.
రైతుల నిర‌స‌న‌ల‌తో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించేందుకు ప్ర‌భుత్వం, రైతు సంఘాల మ‌ధ్య ఇప్ప‌టికి 11 సార్లు చ‌ర్చ‌లు జరపడం తెలిసిందే. అయితే ఆ చర్చలు అటు ప్రభుత్వానికి కానీ, ఇటు రైతులకు గానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
 
సాగు చ‌ట్టాల ర‌ద్దుపై మిన‌హా చ‌ట్ట నిబంధ‌న‌ల‌పై అర్ధ‌రాత్రి అయినా రైతుల‌తో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌ని మంత్రి తోమ‌ర్ పేర్కొన్నారు. రైతుల‌తో ప్ర‌భుత్వ సంప్ర‌దింపుల‌ను తాను స్వాగ‌తిస్తాన‌ని కేంద్ర మంత్రి తోమ‌ర్ త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

‘‘రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ రైతు అయినా, ఏ రైతు సంఘమైనా ప్రభుత్వంతో నేరుగా చర్చలు చేయొచ్చు. అయితే ఒక్క మాట.. వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం మినహా మరే ప్రతిపాదన అయినా ప్రభుత్వంతో చర్చించవచ్చు. అలాంటి ప్రతిపాదనలు, ప్రశ్నలను స్వాగతిస్తాం’’ అని కేంద్ర మంత్రి తోమర్ తెలిపారు. 

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఆందోళన నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒక వంక దేశం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న సమయంలో రైతుల ఉద్యమం జరగడం ఆందోళన కలిగిస్తున్నది.