రాహుల్ బెంగాల్ ఎన్నికల ప్రచారం నిలిపివేతపై వివాదం!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించి, ఆలస్యంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అర్ధాంతరంగా ఆ ప్రచారాన్ని కూడా ముగించారు. అందుకు కరోనా లక్షణాలు కనిపించడంగా అప్పట్లో కారణాలు చెప్పారు. ఈ విషయమై ఇప్పుడు వివాదం చెలరేగుతుంది. 
 
కానీ అది కేవలం సాకు మాత్రమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీ ఇప్పటికే రెండు టీకా  మోతాదులను తీసుకున్నారని,  ఏప్రిల్ 16 న రాహుల్ గాంధీ మొదటి మోతాదు టీకా  తీసుకోనున్నట్లు న్యూస్ 18 జర్నలిస్ట్ పల్లవి ఘోష్ బుధవారం తెలిపారు.
అంతకు ముందు కరోనా పాజిటివ్ గా నిర్ధారించడంతో టీకా తీసుకోలేక పోయారని, వాయిదా వేయవలసి వచ్చినదని ఆ కధనంలో  పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన బహిరంగ ర్యాలీలను రద్దు చేయడానికి కరోనా కారణం కాదని ఈ వార్త ఆకధనం స్పష్టం చేస్తున్నది.
ఏప్రిల్ 18 న రాహుల్  గాంధీ తన ట్వీట్ ద్వారా దేశంలో కరోనా  పరిస్థితులు ఉన్నందున తన బహిరంగ ర్యాలీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సందర్భంగా పెద్ద బహిరంగ ర్యాలీలు నిర్వహించడం వల్ల కలిగే అనర్థాల గురించి లోతుగా ఆలోచించాలని రాహుల్ ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు సూచించారు. 
 
అయితే పల్లవి ఘోష్ తాజా కధనం రాహుల్ ప్రకటనపై వివాదం సృష్టించడంతో విమర్శలను తిప్పికొడుతూ  కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా  గురువారం  సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 16న టీకా తీసుకోవలసి ఉంది. అయితే ఆయనకు స్వల్పంగా ఫ్లూ లక్షణాలు కన్పించడంతో ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్‌నుంచి కోలుకున్న అనంతరం డాక్టర్ల సలహా మేరకు గ్యాప్ తర్వాత ఆయన టీకా తీసుకుంటారని సుర్జేవాలా చెప్పుకొచ్చారు. 
 
పల్లవి ఘోష్ చెప్పిన సమాచారం నిజమైతే, అది నేరుగా పశ్చిమ బెంగాల్‌లో బహిరంగ ర్యాలీలను రద్దు చేసినప్పుడు ఆయనలో ఎటువంటి కరోనా లక్షణాలు ఉండే అవకాశాలు లేవు.  ఉద్దేశ్యపూర్వకంగానే, ఆ సాకుతో తన ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసారా అనే అనుమానం కలుగుతున్నది.

పల్లవి ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తూ, ఆమె ఇచ్చిన సమాచారం నిజమైతే, ర్యాలీలపై నిషేధాన్ని ప్రకటించడం ద్వారా రాహుల్ గాంధీ అతిగా ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. బెంగాల్ లో ఉద్దేశ్యపూర్వకంగానే,  తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవ్వరు ఆమె ఓట్లలో చీలిక తీసుకురాకుండా చేయడం కోసం అవగాహనతో వ్యవహరించారా అనే అనుమానం కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. 

 
బెంగాల్ లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్, సిపిఎంలు ఒక్క సీట్ కూడా గెల్చుకోలేక పోవడానికి వారిద్దరూ మమతా బెనర్జీతో ఏర్పర్చుకున్న అవగాహనే కారణమని బిజెపి నేతలు ఆరోపిస్తూ ఉండడం తెలిసిందే.