మానస్ ట్రస్ట్ భూములపై పెద్దల కన్ను పడడంతోనే వివాదం!

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్ట్ చైర్‌ప‌ర్స‌న్‌గా సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో నెం. 72ను ఏపీ హైకోర్టు తాజాగా ర‌ద్దు చేయడం,  చైర్‌ప‌ర్స‌న్‌గా సంచ‌యిత నియామ‌కం చెల్ల‌ద‌ని స్ప‌ష్టం చేయడంతో  మాన్సాస్‌ ట్రస్ట్ వ్యవహారంపై చెలరేగిన వివాదం కొత్తమలుపు తిరిగింది. 
 
గ‌తంలో చైర్మ‌న్‌గా ప‌నిచేసిన అశోక్ గ‌జ‌ప‌తిరాజునే ఆ ప‌ద‌విలో కొన‌సాగించాల‌ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌డంతో మాన్సాస్ ట్ర‌స్ట్ వివాదం కొనసాగింపు పట్ల వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. 
 
ఇంత‌కీ ఈ వివాదం ఎలా మొద‌లైంది? అస‌లు ఎవ‌రీ సంచ‌యిత గ‌జ‌ప‌తి రాజు ? అని ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది. ఆమె అశోక్ గజపతిరాజు అన్నగారైన ఆనంద గజపతి రాజు కుమార్తె. ఆమె తల్లి ఉమని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆమె విశాఖపట్నం ఎంపీగా కూడా ఒక పర్యాయం ఎన్నికయ్యారు. 
 
అయితే ఉమ ఆయనకు విడాకులు ఇచ్చి, మరొకరిని  వివాహం చేసుకోవడంతో ఆమె కూడా తల్లితోనే ఉంటూ, గజపతి రాజుల కుటుంబంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నారు. ట్ర‌స్ట్ బోర్డు చైర్‌ప‌ర్స‌న్ కాక‌ముందు ఆమె ఢిల్లీలో ఉండేవారు. బీజేపీ యువ మోర్చా జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగానూ ఆమె కొన‌సాగారు.  పైగా, అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుటుంబంతో సంచ‌యితకు మొద‌టి నుంచి ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉండేవి కావు.
విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టు భూములపై కొందరు ప్రభుత్వ పెద్దలు కన్నుపడింది. వాటిని దక్కించుకోవడంలో భాగంగానే ఏడాదిన్నర క్రితం ట్రస్టు చైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజును తప్పించి, ఆ కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న సంచయితకు పట్టం కట్టడంతో ఈ వివాదం చెలరేగింది.
 
విజయనగరం కోటలో ఉన్న ట్రస్ట్ కార్యాలయంను విశాఖ జిల్లా పద్మనాభంకు తరలించి, భూముల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించేలోగా హైకోర్టు తీర్పుతో తిరిగి అశోక్ గజపతి రాజు ట్రస్ట్ చైర్మన్  గా రావడంతో తమ ఎత్తుగడలు తలకిందులయ్యాయని ఆ పెద్దలు ఖంగుతిన్నారు. అయినా పట్టువదలకుండా, ఇప్పుడు నేరుగా అశోక్ గజపతిరాజు లక్ష్యంగా అధికారులపై వత్తిడి తెస్తున్నారు. 
 
మొదటి నుండి టిడిపిలో కీలక నాయకుడైన అశోక్ గజపతిరాజు ప్రభావాన్ని ఆ ప్రాంతంలో తగ్గించడంతో పాటు, ఈ ట్రస్ట్ కు గల వెలది కోట్ల రూపాయల ఆస్తులపై కన్ను పడిన విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తం వివాదం సృష్టికర్తలుగా తెలుస్తున్నది. 
వారిద్దరూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి, ట్రస్ట్ నిబంధనలను  పట్టించుకోకుండా సంచయతను రంగంలోకి తీసుకొచ్చి, అర్ధాంతరంగా అశోక్ గజపతి రాజునూ ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి, ఆమెను నియమించేటట్లు చేశారు. 
 
మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ ట్రస్ట్‌ను పూస‌పాటి వంశీయులైన పూస‌పాటి విజయరామ గజపతి (పీవీజీ) రాజు 1958లో ప్రారంభించారు. త‌న తండ్రి జ్ఞాప‌కార్థం ఆయ‌న ఈ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ స‌మ‌యంలో పీవీజీ రాజు వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్‌గానూ ఆయ‌న కుమారులైన ఆనంద గ‌జ‌ప‌తి రాజు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యులుగా ఉండేవారు. 
 
1994లో పీవీజీ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న పెద్ద కుమారుడు అనంద గ‌జ‌ప‌తి రాజు చైర్మ‌న్ అయ్యారు. 2016లో ఆనంద గ‌జ‌ప‌తి రాజు మ‌ర‌ణించ‌డంతో అశోక్ గ‌జ‌ప‌తి రాజు ట్ర‌స్ట్‌ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌తో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో దాదాపు 14,800 ఎక‌రాల భూమి మాన్సాస్ ట్ర‌స్ట్ పేరిట ఉంది. ఈ భూముల విలువ దాదాపు రూ 50 వేల కోట్లు  ఉంటుంద‌ని అంచ‌నా.
ఇవి కాకుండా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 108 ఆల‌యాలు, వాటి భూములు కూడా ట్ర‌స్ట్ ప‌రిధిలోకే వ‌స్తాయి. అలాగే సింహాచ‌లం వ‌రాహ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యం, అర‌స‌వెల్లి సూర్య‌దేవాల‌యం, విజ‌య‌న‌గ‌రంలోని పైడి త‌ల్లి అమ్మ వారి ఆల‌యం కూడా ఈ ట్ర‌స్ట్ ప‌రిధిలోనే ఉన్నాయి. త‌మిళ‌నాడులో కూడా భూములు ఉన్నాయి. ఈ మాన్సాస్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో 12 విద్యాసంస్థ‌లు న‌డుస్తున్నాయి. వీటిలో 15 వేల మందికి పైగా విద్యార్థులు చ‌దువుకుంటున్నారు.