మహారాష్ట్రలో కాంగ్రెస్ కు శివసేన, ఎన్సీపీ రామ్ రామ్!

 
ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీలో శివసేన, ఎన్సీపీ లతో పాటు భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయడం కోసం ఆ రెండు  పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. వచ్చే శాసనసభ ఎన్నికలలో శివసేన, ఎన్సీపీ కలసి పోటీచేసే అవకాశం ఉన్నట్లు  శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొనడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నది. ‘‘కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లాలని అనుకుంటోంది. అదే నిజమైతే శివసేన, ఎన్సీపీ కలిసి బరిలోకి దిగుతాయి.
ఈ విషయమై శరద్ పవార్, ఉద్ధవ్ ఇప్పటికే మాట్లాడేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాం’’ అని సామ్నా లో శివసేన పేర్కొంది. కాంగ్రెస్ అధిష్ఠానం తప్పనిసరి  పరిస్థితులలో, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ వత్తిడితో శివసేనతో కలసి ప్రభుత్వంలో భాగస్వామి అయింది.  అందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏమాత్రం ఒప్పుకోలేదు. అయితే ఒప్పుకోనని పక్షంలో తామంతా కాంగ్రెస్ ను వదిలి వెడతామని పార్టీ ఎమ్యెల్యేలు హెచ్చరికలు జారీ చేయడం, వారందరిని జైపూర్ లో శిబిరానికి తరలించినా ప్రయోజనం లేకపోవడంతో ఒప్పుకోవలసి వచ్చింది.
 
ముఖ్యమంత్రి పదవి విషయమై ఎన్నికలలో కలసి పోటీ చేసిన బిజెపి – శివసేనల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో శరద్ పవర్ చొరవ తీసుకొని శివసేన, కాంగ్రెస్ లను దగ్గరకు తీసుకొచ్చి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న బిజెపి – శివసేనల కూటమిని కూల్చివేయడం తెలిసిందే. పవర్ మంత్రాంగం ఫలించడంతోనే ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి కాగలిగారు. 
 
అప్పటి నుండి థాకరే సహితం పవర్ పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారు. కీలక అంశాలపై ఆయన సలహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానితో కూటమిలో భాగస్వామి అయిన తమను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు అసమ్మతి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 
 
వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేల్ ప్రకటించిన రెండు రోజులకు సామ్నా ఈ కధనం పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరుగవలసి ఉంది. మరో నాలుగేళ్లకు ముందే వచ్చే ఎన్నికల గురించి అధికార కూటమిలోని ప్రధాన పార్టీలు మాట్లాడుతూ ఉండడం గమనిస్తే ఈ కూటమి ఎప్పుడైనా కూలిపోవచ్చని బిజెపి నేతలు భావిస్తున్నారు. 
 
ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడం పట్ల తమకు ఆసక్తి లేదని, అంతర్గత వైరుధ్యాలతో తనంతట తానే కూలిపోక తప్పదని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం అంటూ జరిగితే ఆ పార్టీలో ఎంతమంది మిగులుతారో అన్నది ప్రశ్నార్ధకరమే అని పరిశీలకులు భావిస్తున్నారు. 
 
ఎన్నికల సమయం నాటికి తమ రాజకీయ భవిష్యత్ కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలలో చేరే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఈ విషయమై శరద్ పవర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.