దేశ భద్రతలో కీలకంగా వాయుసేన

దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తుందని ఎయిర్‌ ఛీప్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా తెలిపారు. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకామడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ జరిగింది. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్‌గార్డ్‌లో ఐదుగురు కెడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.  పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న శిక్షణ పూర్తి చేసుకున్న కెడెట్లు పాల్గొన్నారు.
పరేడ్‌ను చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా సమీక్షించారు. ఈ సందర్భంగా కెడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్‌, నావిగేషన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వింగ్స్‌, బ్రెట్స్‌ ప్రదానం చేశారు.
 
అనంతరం భదౌరియా మాట్లాడుతూ 172 మంది ఫ్లయింగ్‌ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. 20,500 గంటల ఫ్లయింగ్‌ శిక్షణను ఈ బ్యాచ్‌ పూర్తి చేసిందని కొనియాడారు. బీటెక్‌ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్‌ అధికారులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షకులను, సిబ్బందిని అభినందించారు. 
 
దేశం కోసం త్యాగం చేయడమే ఫ్లయింగ్‌ అధికారుల ధ్యేయమని పేర్కొన్నారు. దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్‌ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. 
 
 ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప‌రిస్థితిపై ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ప్రస్తావిస్తూ భార‌త‌, చైనా ద‌ళాల మ‌ధ్య మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు  చెప్పారు. క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు ఉంటాయ‌ని, దాని ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. చైనా సైనికాధికారుల‌తో చర్చ కొన‌సాగిస్తూనే ఉంటామ‌ని స్పష్టం చేశారు. 
 
ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల నుంచి ద‌ళాలు ఉప‌సంహ‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని, దాంతో ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే ఏర్పాట్లు చేస్తామ‌ని భ‌దౌరియా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతూ మన వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని స్పష్టం చేశారు. గ‌త ఏడాది కాలంలో భార‌త శ‌క్తి సామ‌ర్ధ్యాలు పెరిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు.