కోవిడ్‌ -19 పునరుజ్జీవంపై తక్షణ చర్యలు అవసరం!

కోవిడ్‌ -19 కేసుల పునరుజ్జీవంపై (ధర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని) ప్రముఖ పత్రిక లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. కోవిడ్‌ పోరులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం అవలంభించాల్సిన ఎనిమిది అత్యవసర చర్యల జాబితాను రూపొందించింది. 
 
1. అవసరమైన ఆరోగ్య సేవలను వికేంద్రీకరించాలి. కోవిడ్‌ కేసుల సంఖ్య, ఆరోగ్య సేవలు జిల్లా నుండి జిల్లాకు గణనీయంగా భిన్నంగా ఉన్నందున ఒకే విధానాన్ని అవలంభించడం ఆమోద్య యోగ్యం కాదు.
 
2. అన్ని ముఖ్యమైన ఆరోగ్య సేవలకు సంబంధించిన ధరలపై పరిమితులతో కూడిన పారదర్శక జాతీయ ధర విధానం ఉండాలి. ఉదాహరణకు అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌, అత్యవసరమైన మందులు, హాస్పిటల్‌ సంరక్షణలో వ్యక్తిగత ఖర్చులను తగ్గించాలి. ఆ ఖర్చులను ప్రస్తుత ఆరోగ్య కేంద్రమే భరించాలి.
 
3. కోవిడ్‌-19 నిర్వహణపై స్పష్టమైన, సాక్ష్యాధారిత సమాచారం విస్తృతంగా వ్యాప్తి చేయాలి. అమలు చేయాలి. అంతర్జాతీయ మార్గదర్శకాలను అనుసరించి గృహసంరక్షణ, చికిత్స, ప్రాథమిక సంరక్షణపై స్థానిక పరిస్థితులు ఆధారంగా చికిత్స విధానాన్ని స్థానిక భాషల్లోకి అనువదించాలి.

4. ప్రైవేటు రంగాలతో సహా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోని అన్ని రంగాల మానవ వనరులను కోవిడ్‌ -19 ప్రతిస్పందనలో భాగస్వామ్యం చేయాలి. వారికి అవసరమైన వనరులను సమకూర్చాలి. క్లినికల్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు వినియోగంపై అవగాహన కల్పించాలి. బీమా రక్షణతో పాటు మానసిక ఆందోళనలను నుంచి బయటపడేలా మద్దతు ఇవ్వాలి.

5. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రస్తుత వికేంద్రీకరణ విధానాల నుండి బయటపడి కేంద్రమే కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ఉచితంగా సేకరించి, అందించాలి.

6. కోవిడ్‌ -19 ప్రతి స్పందనలో ప్రజా భాగస్వామ్యం కొరవడినందున..ప్రభుత్వానికి, పౌర సంఘాల మధ్య క్రియాశీలక సమన్వయం ఉండాలి. దీని ద్వారా గృహ ఆధారిత రక్షణ, నివారణ ప్రాధాన్యతనిచ్చేలా సరైన సమాచారం అందించాలి. వ్యాక్సిన్‌ ప్రోత్సహించడం, ప్రాణ భయం లేని చికిత్స అందించాలి.

7. డేటా సేకరణలో పారదర్శకత ఉండాలి. రాబోయే రోజుల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి.

8. కరోనా కారణంగా దేశంలో అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నందున…దాని వల్ల ఏర్పడ్డ ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులను తగ్గించేందుకు వారికి నగదు బదిలీ వంటివి చేపట్టాలి.