
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో ఏప్రిల్ నెలలో జరిగిన మహా కుంభమేళాలో కరోనా టెస్టింగ్ కుంభకోణానికి సంబంధించి రెండు ప్రైవేట్ ల్యాబ్‌లతోపాటు మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీపై కేసు నమోదైంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని, ఎవ్వరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ స్పష్టం చేశారు.
తాను ముఖ్యమంత్రిగా రాక ముందు ఈ కుంభకోణం జరిగినదని చెబుతూ, ప్రభుత్వ దర్యాప్తులో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. నెల రోజులపాటు జరిగిన ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి సుమారు 70 లక్షల మంది భక్తులు హాజరై పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో, హర్యానాకు చెందిన 22 ల్యాబరేటరీలను ఏప్రిల్ 1 నుండి 30 వరకు జరిగిన కుంభమేళా సమయంలో హరిద్వార్ లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ఇవి సుమారు 2.5 లక్షలకుపైగా భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించాయి. అయితే కేవలం 2,500 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
కాగా, చాలా మంది భక్తుల ఐడీ కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా లక్షకుపైగా నకిలీ కరోనా ఫలితాలను పలు ల్యాబ్స్ ఇచ్చినట్లు వెలుగుచూసింది. దీనిపై హరిద్వార్ పాలనా యంత్రాంగం గత వారం దర్యాప్తునకు ఆదేశించింది. చాలా ల్యాబ్స్ నకిలీ కరోనా టెస్ట్ రిపోర్టులు ఇచ్చాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
బుధవారం మరో దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఈ స్కామ్‌పై ఫిర్యాదు చేసింది. మాక్స్ కార్పొరేట్ ఏజెన్సీతో పాటు లాల్‌చందాని ల్యాబ్స్, నల్వా ల్యాబ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో వీటిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సెంథిల్ అబుదై కృష్ణరాజ్ తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో రోజువారీ 50 వేల పరీక్షలు చేయడం నిమిత్తం ఈ ఫేక్ టెస్టులకు ల్యాబరేటరీలు పాల్పడ్డాయని నివేదికలు వెలువడ్డాయి. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కుంభమేళా సమయంలో ఆర్‌టి పిసిఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించేందుకు బాధ్యతలను అప్పగించి ల్యాబ్‌లకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ చెప్పారు.
కాగా, అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం తిరస్కరించిన ఏజెన్సీకి కుంభమేళా నిర్వాహకులు టెస్టింగ్ కాంట్రాక్టు ఇచ్చారని తెలుస్తున్నది. ఇసిఎంఆర్ గుర్తింపు గల రెండు ల్యాబ్ లతో వారు ఒప్పందం చేసుకోవడం కారణంగా చూపారు.
More Stories
బెంగాల్ లో రాష్ట్రపతి పాలనకై సుప్రీంలో పిటిషన్
క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
యుద్ధ రహస్యాలు ఇంట్లో లీక్ చేసిన అమెరికా రక్షణ మంత్రి!