కరోనా బారిన పడిన చిన్నారులలో 95 శాతం మంది ఇంటివద్దనే కోలుకొంటారని, వారిని ఆసుపత్రులలో చేర్పించవలసిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా మూడవ వేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా త్రోసిపుచ్చింది.
వీరిలో చాలా మందిలో లక్షణాలు కనిపించకపోవడమో, చాలా తక్కువ స్థాయిలో కనిపించడమో జరుగుతుందని వివరించింది. ఇలాంటి కేసులకు ఇంట్లోనే చికిత్స అందిస్తే సరిపోతుందని తెలిపింది. ఈమేరకు కోవిడ్ సోకిన పిల్లల ఐసోలేషన్, ట్రీట్‌మెంట్, పోస్ట్ కోవిడ్ కేర్, హాస్పిటల్ సన్నాహాలపై బుధవారం మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది.
పిల్లల కరోనా చికిత్సలో పెద్దలకు వాడే ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫావిపిరవిర్, డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి మందులను వాడొద్దని హెచ్చరించింది. ఈ మందుల ప్రయోగాలు పిల్లలపై జరగలేదని, అందువల్ల వాటిని ఉపయోగించడం సరికాదని స్పష్టం చేసింది. కార్టికోస్టెరాయిడ్స్, రెమ్‌డెసివిర్ వంటివి చాలా సీరియస్ కేసుల్లో మాత్రమే ఉపయోగించాలని సూచించింది.
ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు పంపిస్తామని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నాయని కేంద్రం గుర్తుచేసింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం వల్ల పిల్లల్లో కరోనా కేసులు పెరగొచ్చని పేర్కొంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో 88% పెద్దవాళ్లు, 12% మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారని, థర్డ్ వేవ్‌లో ఈ లెక్కలో మార్పు రావొచ్చని తెలిపింది.
తొలి రెండు వేవ్స్‌లో కోవిడ్ బారిన పడ్డ పిల్లల్లో 2% నుంచి 3% మంది మాత్రమే హాస్పిటళ్లలో చేరారని, థర్డ్ వేవ్‌లో ఇది 5% దాకా ఉండొచ్చని పేర్కొంది. ఇక, హాస్పిటళ్లలో చేరిన పిల్లల్లో 40% మందికి ఐసీయూ అవసరం పడొచ్చని చెబుతూ, దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
పౌష్టిక ఆహార లోపంతో బాధపడే పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లపైనే కరోనా ప్రభావం ఎక్కువుంటుందని తెలిపింది. ఈ పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంది. కరోనా సోకిన పిల్లల్లో కనిపించే లక్షణాలు, మందుల వాడకం, ఆక్సిజన్, పల్స్‌రేట్, టెంపరేచర్ చెక్ చేయడం వంటి వాటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కోవిడ్ సోకిన పిల్లల్లో కనిపించే లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సమస్య, గొంతు నొప్పి, డయేరియా, వాంతులు, అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఈ లక్షణాల తీవ్రతను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ డిసీజ్‌గా విభజించి, అవసరమైన హాస్పిటల్‌కు పంపించాలి.
పిల్లలకు సింప్టమ్స్ వస్తే వెంటనే టెస్టు చేయించాలి. పిల్లలున్న ఇంట్లో పెద్దవాళ్లకు కరోనా వస్తే, లక్షణాలు లేకున్నా పిల్లలకు టెస్ట్ చేపించాలి. పిల్లల్లో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పిల్లల తల్లిదండ్రులకు పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చి పంపాలి. వెంటనే స్పందించేలా కాల్ సెంటర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులకు ఎమర్జన్సీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలని వివరించింది.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత