మెగా సౌర విద్యుత్‌ టెండర్లను రద్దుచేసి ఏపీ హైకోర్టు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చెప్పట్టిన 6400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు ఎపి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (ఎపిజిఇసిఎల్‌) పిలిచిన టెండర్లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ టెండర్లు పిలవాలని, తిరిగి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రూపొందించాలని కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు గురువారం తీర్పు చెప్పారు. 

అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో రైతులకు నిరంతర విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం 6400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ఎపిజిఇసిఎల్‌ ఇచ్చిన రిక్వెస్ట్‌ ఫర్‌ సెలక్షన్‌ (ఆర్‌ఎఫ్‌ఎస్‌), పిపిఎలను గత జనవరిలో టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైకోర్టులో సవాల్‌ చేసింది.

ప్రభుత్వానికీ, ఉత్పత్తి సంస్థకూ మధ్య వివాదాలు తలెత్తితే… దానిని స్వయంప్రతిపత్తి ఉన్న విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఈఆర్సీ) పరిష్కరించాలని కేంద్ర విద్యుత్‌ చట్టం-2003 చెబుతోంది. కానీ… రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారాన్ని తానే అట్టిపెట్టుకుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నిబంధనలను కూడా మార్చేసింది. 

దీంతో రిక్వెస్ట్‌ ఫర్‌ సెలక్షన్‌ (ఆర్‌ఎ్‌ఫఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం నిబంధనలు కేంద్ర విద్యుత్‌ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్‌ రెన్యూవబల్‌ ఎనర్జీ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కు విరుద్ధమైన నిబంధనలు విధించారన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నిబంధనలు కూడా కేంద్ర ఇంధన శాఖ 2017 ఆగస్టు 3న జారీ చేసిన బిడ్డింగ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.

టెండర్ల ప్రక్రియలో కూడా పొల్గన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు ఆమోదించింది. గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు గురువారం ఆర్‌ఎఫ్‌ఎస్‌ను, పిపిఎలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.

గత టీడీపీ ప్రభుత్వం అనవసరంగా సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించిందని, అవసరానికి మించి వాటి ఉత్పత్తిని ఆమోదించి రాష్ట్రంపై భారం మోపిందని ముఖ్యమంత్రి అయిన కొత్తలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తర్వాత ఏకంగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించి టెండర్లు పిలిచారు. 

ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కూడా కల్పించింది. టెండర్‌ దక్కించుకొన్న వారు అదే ధరకు మరో 50 శాతం అదనపు సామర్థ్యంతో ప్రాజెక్టులు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అంటే, ఈ టెండర్ల ద్వారా ఏకంగా ఒకేసారి పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి తలుపులు తెరిచినట్లయింది.  

దీనిపై విద్యుత్‌ ఇంజనీర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న విద్యుత్‌ వాడకానికి రెట్టింపు స్థాయిలో కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని, మళ్లీ కొత్తగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతించి, కొనుగోలు చేస్తే అమితమైన భారం పడుతుందని హెచ్చరించాయి.

గత ప్రభుత్వం పాతికేళ్ల వ్యవధికి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుందంటూ తూర్పారబట్టిన జగన్‌ ఈ టెండర్లలో కొనుగోలు ఒప్పందాల వ్యవధిని ఏకంగా 30 ఏళ్లు చేశారు. టెండరుకు ప్రతిస్పందనగా ఐదు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. 

ఇందులో అదానీ గ్రూప్‌, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థలే దాదాపు 80 శాతం సామర్థ్యం మేరకు ప్లాంట్లను దక్కించుకున్నాయి. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఏమాత్రం అనుభవం లేని షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ వేల కోట్ల మెగావాట్ల మేర సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ఎంపిక కావడం విమర్శలకు దారితీసింది.