కాకినాడ పెట్రో కారిడార్‌ కు కేంద్రం సుముఖత 

కాకినాడ పెట్రో కారిడార్‌ కు కేంద్రం సుముఖత 
కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. రూ.25 వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ను ఆయన కలిశారు. 
 
దీని ద్వారా రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 93(4) ప్రకారం ఏపీలో రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు  గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.
 
దీని కారణంగా  రానున్న రెండు, మూడేళ్లలో పెట్రో కెమికల్‌ రంగంలో పెట్టుబడుల ప్రవాహం రానున్నదని, ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌ లో రూ.25 నుంచి 30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అనుబంధ పరిశ్రమలు కలుపుకొని మరో రూ 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని పేర్కొన్నారు. 
 
పెట్రోలియం, సహజ వాయువు సంయుక్త కార్యదర్శి చైర్మన్‌గా కేంద్ర, రాష్ట్ర అధికారులతో వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరించారు. పెట్రో కెమికల్‌ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారానికి అంగీకారం తెలిపిందని చెప్పారు. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ గురించి ప్రాజెక్టు రిపోర్ట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చామని, వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయడానికి దిశానిర్దేశం చేశామని చెప్పారు.
 
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ లో ఇథనాల్‌ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో ఇథనాల్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. రిఫైనరీ సామర్థ్యం పెంపు, మొలాసిస్‌ ద్వారా ఇథనాల్‌ గా మార్చడం కోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీకి కూడా కేంద్రం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందని తెలిపారు. 
 
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌ దాస్‌, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఉన్నారు.