సంగం డెయిరీ కేసులో ఏసీబీకి చుక్కెదురు 

సంగం డెయిరీ కేసులో ఏసీబీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీలో సెర్చ్ వారెంట్ రీకాల్ చేయాలంటూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏసీబీ స్పెషల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని కోర్టు పేర్కొంది.

గతంలో సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మే 29న సంగం డెయిరీ పాలక వర్గ సమావేశం విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించారు.

కర్ఫ్యూ, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఈ సమావేశం నిర్వహించారని పటమట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కిశోర్‌ కుమార్‌ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర, సిరిమల్లెల రాజేంద్రప్రసాద్‌, గోపాలకృష్ణతోపాటు మొత్తం 20 మందిపై కేసు నమోదు అయింది. కాగా, సమావేశంలో తాము 12 మంది మాత్రమే పాల్గొన్నామని సంగం డెయిరీ ప్రతినిధులు చెబుతున్నారు.