ఎమ్మెల్సీల నామినేషన్ కు గవర్నర్ ఆమోదం!

నలుగురు ఎమ్మెల్సీల నామినేషన్ కు ఎఎట్టకేలకు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. నాలుగు రోజులుగా సంతకం చేయకుండా ఉంటూ వచ్చిన గవర్నర్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి, కలిసిన రెండు గంటలకే ఈ ఫైల్ పై సంతకం చేయడం గమనార్హం.
దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్‌ (వైఎస్సార్‌ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. వీరితో కలుపుకుంటే శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 18కి పెరుగుతుంది. తొలుత, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఫైల్‌ను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు.
నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఈ నాలుగురు పేర్లు పంపింది. సాధారణంగా ఫైల్స్ వచ్చిన రోజుననే సంతకాలు చేస్తూ వచ్చిన గవర్నర్ ఈ ఫైల్ విషయంలో జాప్యం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి ఏర్పడింది.
దానితో ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ ను కలసి వివరణ ఇచ్చిన్నట్లు భావిస్తున్నారు. ఇక ఆ నలుగురు త్వరలోనే శాసన మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయడానికి మార్గం సుగమం అయింది.  తమ నియామకానికి తోడ్పడిన సీఎం వైఎస్‌ జగన్, గవర్నర్‌కు కొత్త ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరి  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్‌ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు.  కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్‌ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు.