ఉదయలక్ష్మికి వారెంట్‌, నీలం సాహ్నికి నోటీసులు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇద్దరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులకు శ్రీముఖం పంపింది. మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి నోటీసులు జారీ చేయగా, మరో రిటైర్డ్ అధికారి ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. 

గతంలో రాజమండ్రికి చెందిన  పీఈటి రత్నకుమార్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. అతనికి న్యాయం చేయాలని అప్పుడు  ఉన్నత విద్యాశాఖ  కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న  ఉదయాలక్ష్మికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ఆ ఆదేశాలను ఆమె అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణగా పరిగణించిన హైకోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మిని హైకోర్టులో హాజరు పరచాలని గుంటూరు రూరల్ ఎస్పీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై  కౌంటర్ దాఖలు చేయాలని ప్రస్తుత సీఎస్, గత ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అదిత్యనాధ్ దాస్‌కు హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.