సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఎందుకు?

గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్‌ల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏమిటని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. 

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన జీవో 2ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ టి.కృష్ణమోహన్‌ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం విచారణ జరిపారు. 

పిటిషనర్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ  ‘పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలను హరించేలా ప్రభుత్వ జీవో ఉంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్వోలకు అధికారాలు అప్పగించారు. సర్పంచ్‌ కంటే వీఆర్వోకు ఎక్కువ అధికారాలు కల్పించారు’ అని తెలిపారు. 

ఆ జీవో రాజ్యాంగంలోని 73వ సవరణకు, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వీఆర్వో వ్యవస్థ పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను నియంత్రిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్‌లు నామమాత్రమయ్యారని తెలిపారు.  ముఖ్యమంత్రి కోరిక మేరకు నవరత్నాలు పథకాల అమలు కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని చెప్పారు

ప్రభుత్వం జారీ చేసిన జీవో-2 అమలును నిలుపుదల చేయండని కోరారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామ సచివాలయాలు, వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. సర్పంచ్‌, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘పంచాయతీలకు నిధుల కేటాయింపు పెంచి, మౌలిక సదుపాయాలు పెంచవచ్చు కదా! వాటికి సమాంతరంగా గ్రామ సచివాలయాలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. 

`వీఆర్వోలకు అధికారాలు అప్పగించడం.. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల అధికారాలు లాగేసుకోవడమే కదా! గతంలో ఇచ్చిన జీవోలు 110, 149లకు విరుద్ధంగా జీవో-2 ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అదే విధంగా అధిపతి’ అని వ్యాఖ్యానించారు. 

వ్యవస్థను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఏజీకి సూచించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి తన తీర్పును వాయిదా వేశారు.